తెలంగాణపై ఏకాభిప్రాయం వచ్చింది

ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో  ఆందోళనలు తక్కువే..
ఇవ్వకపోతే తెలంగాణలో మహోద్యమం
ఆర్‌ఎల్డీ అధినేత అజిత్‌సింగ్‌
న్యూఢిల్లీ, జనవరి1 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పాటుపై ఏకాభిప్రాయం వచ్చిందని కేంద్ర మంత్రి రాష్ట్రీయ లోక్‌దళ్‌ అధినేత అజిత్‌ అన్నారు. శుక్రవారం తనను కలిసిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలతో ఆయన మాట్లాడుతూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చిన్న రాష్టాల్ర ఏర్పాటుకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ కృషి చేస్తుందని, తాము ఈ విషయంలో పూర్తిగా సహకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. యూపీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో తెలంగాణ ఏర్పాటుపై చర్చిస్తమని పేర్కొన్నారు. శరద్‌ పవార్‌ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటన చేసిన నేపథ్యంలో మరోమారు అజిత్‌సింగ్‌ తన వైఖరిని వెల్లడించారు. చిన్న రాష్టాల్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న పార్టీలన్నింటినీ కలుపుకుని తెలంగాణ ఏర్పాటుకు కృషి చేస్తమని తెలిపారు. తెలంగాణ లక్ష్యంగా రాష్టీయ్ర లోక్‌దళ్‌ ఇక్కడ పార్టీశాఖను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే తెలంగాణకు  మద్దతు కోరుతూ కాంగ్రెస్‌ నేత కె.కేశవరావు శుక్రవారం అజిత్‌సింగ్‌ను కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సమర్పించిన రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని కేశవరావు స్పష్టం చేశారు. రాజీనామా విషయంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని కేకే అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్‌ వేచిచూసే ధోరణి అవలంబిస్తే కాంగ్రెస్‌కే నష్టమని కేకే తెలిపారు. న్యూఢిల్లీలో కేంద్రమంత్రి అజిత్‌సింగ్‌ను కలిసిన తర్వాత మీడియాతో కేకే, వివేక్‌ మాట్లాడారు. తెలంగాణకు చాలా పార్టీలు మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. తెలంగాణ ఇచ్చినా ఆంధ్రా ప్రాంతంలో కొద్ది రోజులు మినహా పెద్దగా ఆందోళనలు ఉండవని తెలిపారు. అదే తెలంగాణ ఇవ్వకుంటే అక్కడ మహోద్యమం పుడుతుందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రం గుర్తింస్తుందని, ఈ మేరకు ఒత్తిడి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.