తెలంగాణపై కేసీఆర్ కొత్త స్టోరీ?
హైదరాబాద్, జూలై 6 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర నాయకులు అంగీకరించకపోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) అధినేత కె. చంద్రశేఖరరావు కొత్త కథ వినిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీటి యుద్ధాలు జరుగుతాయని కాంగ్రెస్ సీమాంధ్ర నాయకులు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు అంటున్న నేపథ్యంలోనే కేసీఆర్ ఓ పవర్‌ఫుల్ స్టోరీని ముందుకు తెచ్చారు. హైదరాబాద్ సిర్ఫ్ హమారా అనే ఓ టీవీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిడికెడు మంది సీమాంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డం పడుతున్నారని, అసైన్డ్, అక్రమ భూములను కలిగి ఉన్న నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డం పడుతున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్‌ను సమస్యగా చూపడం పెట్టుబడులు పెట్టడం వల్ల కాదని, అక్రమాస్తుల వల్లనే అని ఆయన అన్నారు. చట్టబద్దమై ఆస్తుల విషయంలో సమస్య ఉండదని, అక్రమాస్తులను కలిగి ఉన్నందునే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సమస్య వస్తుందని వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్‌లేని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తాము అంగీకరించబోమని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ రాజధానిగా తమకు తెలంగాణ రాష్ట్రం కావాలని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన తప్పదని ఆయన అన్నారు. రాయల తెలంగాణ వంటి పిచ్చి ప్రతిపాదనలతో తెలంగాణ ప్రజలు అయోమయానికి గురి కావద్దని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తప్పదని ఆయన అన్నారు. కాగా, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అక్రమాస్తుల కారణంగానే సీమాంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారనే కేసీఆర్ మాటలు చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్‌లోని, హైదరాబాద్ పరిసరాల్లోని భూములకు విపరీతంగా గిరాకీ ఆంటూ వస్తోంది.