తెలంగాణపై బాబు వైఖరిని ప్రశ్నించే హక్కు మాకుండదా ?

ఇదెక్కడి ప్రజాస్వామ్యం

సర్కారుకు కోదండరాం సూటి ప్రశ్న

మహబూబ్‌నగర్‌, అక్టోబర్‌ 22 (జనంసాక్షి) :
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్ర పాలమూరులో ఉద్రిక్తత రేపుతోంది. ఆయన పాదయాత్రను నిరసన తెలిపేందుకు బయల్దేరిన తెలంగాణ జేఏసీ నేతలను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పని చంద్రబాబు.. తెలంగాణలో పాదయాత్ర చేపట్టడంపై నిరసన వ్యక్తం చేసేందుకు రాజోలుకు బయల్దేరిన టీ-జేఏసీ నేతలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. భారీ కాన్వాయ్‌గా బయల్దేరిన నేతలను శాంతినగర్‌ వద్ద నిలిపివేశారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయన్న సాకుతో ముందుకు వెళ్లనిచ్చేది లేదని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా పోలీసులకు, నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తాము బాబు పాదయాత్రను అడ్డుకోం, నిరసన మాత్రమే తెలుపుతామని జేఏసీ నేతలు ఎంతగా నచ్చజెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. రాజోలులో టీడీపీ పాదయాత్ర సందర్భంగా.. పోటీగా సభ నిర్వహించడానికి అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. అయితే, తాము శాంతియుతంగా నిరసన ర్యాలీ మాత్రమే చేపడతామని జేఏసీ నేతలు చెప్పగా.. ర్యాలీలో అసాంఘిక శక్తులు చొరబడే ప్రమాదం ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. రాజోలుకు వెళ్లనిచ్చేది లేదని, అవసరమైతే శాంతినగర్‌లోనే నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు అనుమతిస్తామన్నారు. అయితే, పోలీసుల తీరును నిరసిస్తూ.. కోదండరాం సహా నేతలంతా అక్కడే రోడ్డుపై బైఠాయించారు. నిరసన తెలిపే హక్కు లేదా..?తమకు నిరసన తెలిపే హక్కు లేదా? అని కోదండరాం పోలీసులను ప్రశ్నించారు. శాంతియుతంగా వెళ్తామంటే అడ్డుకోవడమేమిటని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ఆ హక్కును కాలరాయడమేమిటని ప్రశ్నించారు. తామేవిూ దాడి చేయడానికో, దండయాత్ర చేయడానికో వెళ్లడం లేదని, కేవలం నల్లజెండాలు, నల్ల బెలూన్లతో నిరసన తెలుపుతామంటే అనుమతించక పోవడం దారుణమని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాయుతంగా నిరసన తెలిపే హక్కు కూడా తమకు లేదా? అని ప్రశ్నించారు. తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామని చెబుతుంటే.. అనుమతి లేదని అడ్డుకోవడం సరికాదన్నారు. తామేవిూ మైకులు పెట్టి సభలు నిర్వహించడం లేదని, అందుకు అనుమతి అక్కర్లేదన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే తమ హక్కును అడ్డుకోవడం అన్యాయమని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శించారు. ప్రతిపక్షానికి వంతపాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు పాదయాత్ర చేయాలని బాబుకు సూచించారు. ఆయన రాకను వ్యతిరేకిస్తూ.. నిరసన చేసే హక్కు తెలంగాణ ప్రజలకుంటుందని, నిరసన తెలుపుతుంటే అరెస్టు చేయడం సబబు కాదన్నారు. ప్రజల ఆకాంక్షలు పట్టని చంద్రబాబు, టీడీపీ నేతలకు ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. పాలమూరులో అక్రమ అరెస్టుల పరంపర కొనసాగడం ఆంధ్ర పాలకుల కుట్రలో భాగమేనన్నారు. శాంతియుతంగా నిరసత తెలుపుతున్న తమను అరెస్టు చేయడం సరికాదన్నారు. పోలీసులు తమ పట్ల దారుణంగా ప్రవర్తించామని మండిపడ్డారు. పోలీసుల తీరుపై స్వామిగౌడ్‌ మండిపడ్డారు. అర్ధరాత్రి వరకూ తమ నిరసన కొనసాగుతుందని స్వామిగౌడ్‌ ప్రకటించారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న ఒకే సాకుతో తమను అరెస్టు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ కలిసి కుమ్మక్కై తెలంగాణను అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. వస్తున్నా విూ కోసం అంటూ పాదయాత్ర చేపట్టిన వారు మా సమస్యలు వినకపోవడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు యత్నిస్తున్నాయని శ్రీనివాస్‌గౌడ్‌ మండిపడ్డారు. అందులో భాగంగానే తమను అరెస్టు చేశారని విమర్శించారు. తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు ఈ ప్రాంత ప్రజల మనోభావాలు తెలుసుకోరా? అని ప్రశ్నించారు. అదే సమయంలో జేఏసీ ‘చలో రాజోలు’ కార్యక్రమాన్ని నిరసిస్తూ.. ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు అక్కడికి తరలివచ్చారు. జేఏసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు పాదయాత్రను అడ్డుకోవద్దని కోరారు. అడ్డుకుంటే తగిన బుద్దిచెబుతామని జేఏసీ నేతలను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అక్కడి నుంచి తరిమికొట్టారు. మరోవైపు, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జేఏసీ నాయకులు కోదండరాం సహా స్వామిగౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, వేదకుమార్‌, దిలీప్‌కుమార్‌ తదితరులందరినీ అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఆలంపురా పోలీసుస్టేషన్‌కు తరలించారు. మరోవైపు, జేఏసీ నేతల అరెస్టును నిరసిస్తూ విద్యార్థి సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించారు.