తెలంగాణపై స్పష్టత ఇవ్వాల్సిందే: కోదండరామ్‌

మహబూబ్‌ నగర్‌,నవంబర్‌26(జనంసాక్షి): తెలంగాణ అమరులకు  జగన్‌ సోదరి షర్మిల సలాం చేయడం సరిపోదని, అమరుల త్యాగాలను గుర్తించి, వారి ఆశయాల సాధన దిశగా నడవాలని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. తెలంగాణపై ఆ పార్టీ స్పష్టత ఇవ్వాలన్నారు. తెలంగాణపై  పార్టీ వైఖరి చెప్పకుండా కల్లబొల్లి కబుర్లు చెప్పడం సరికాదన్నారు. నాగర్‌ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్దన్‌ రెడ్డి తెలంగాణ భరోసా యాత్ర ప్రారంభ కార్యక్రమంలో ఆయన సోమవారం పాల్గొన్నారు.తెలంగాణపై మాట్లాడుకుండా ఓట్లు- దండుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చూస్తున్నారని ఆయన విమర్శించారు. రాజకీయ నాయకుల పాదయాత్రలను ఆదరిస్తే భస్మాసురుడికి వరం ఇచ్చినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం రాజ్యాధికారం కోసం కాదని, రాష్ట్ర సాధనకు మాత్రమేనని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే మరోసారి సకల జనుల సమ్మె చేస్తామని తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకుడు శ్రీనివాస గౌడ్‌ అన్నారు.తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌ రెడ్డి తన తెలంగాణ భరోసా యాత్రను ప్రారంభించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట నుంచి ఆయన సోమవారం తన యాత్రను ప్రారంభించారు. తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్‌ కోదండరామ్‌, బిజెపి నేత బండారు దత్తాత్రేయ మద్దతు ప్రకటించి యాత్రలో పాల్గొన్నారు.శ్రీకృష్ణ కమిటీ- కాంగ్రెసు కుట్ర అని ఆయన ఆరోపించారు. ఆత్మహత్యలకు కారణమవుతున్న కాంగ్రెసును భూస్థాపితం చేయాలని అన్నారు. రాజకీయ పార్టీలు జెండాలు పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమంలోకి రావాలని ఆయన అన్నారు. విద్యార్థులు ఎవరూ తెలంగాణ కోసం బలిదానాలు చేసుకోవద్దని ఆయన అన్నారు.

తాజావార్తలు