తెలంగాణలో చల్లబడ్డ వాతావరణం
` వచ్చే 3 రోజులు వానలు కురిసే అవకాశం
` పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్.!
హైదరాబాద్‌్(జనంసాక్షి): తెలంగాణలో వాతావరణం క్రమేపీ చల్లబడుతోంది. ఎండల తీవ్రత తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో 47 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు.. ప్రస్తుతం 40 డిగ్రీలకు పడిపోయింది. దీనికి కారణంగా ఉపరితల ఆవర్తనమే అని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో అవర్తనం ఏర్పడిరదని.. దీని కారణంగా రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు. బుధవారం.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.గురువారం.. ఉరుములు, మెరుపులు, 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అలాగే ఉరుములు, మెరుపులు, 30-40 కిమీ వేగంతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. శుక్రవారం.. ఉరుములు, మెరుపులు, 30-40 కిమీ వేగంతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గత ఏడాదిలా కాకుండా ఈసారి తెలుగు రాష్ట్రాలను గట్టిగా పలకరిస్తామంటున్నాయి నైరుతి రుతుపవనాలు. విపరీతమైన ఎండలు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ ఏడాది ముందుగానే నైరుతి పలకరిస్తుందంటోంది. ఈనెల 19వ తేదీన అండమాన్ నికోబార్ దీవులను నైరుతి రుతు పవనాలు తాకుతాయి. ఆ తర్వాత కేరళను పలకరించి.. తెలుగు రాష్ట్రాలకు చల్లని మబ్బులు దూసుకొస్తాయి. గత ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయిన నేపథ్యంలో.. ఈసారి రుతు పవనాలు ఎలా ఉండబోతున్నాయి? వర్షాలు సమృద్ధిగా పడతాయా? సాధారణంగా ఉంటాయా? ఇప్పుడు ఇదే ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈసారి వర్షపాతం బాగా నమోదవుతుందని చెబుతోంది వాతావరణ శాఖ. ఎల్ నినో ప్రభావం తగ్గి, లా నినో ప్రభావం రాబోతుండడం దీనికి దోహదం చేస్తుందంటున్నారు అధికారులు. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది. రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయని, వర్షాలు కురిసేందుకు అనువైన వాతావరణం ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ ఏడాది ప్రస్తుతానికి అనుకూల పరిస్థితులే ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తొలకరి పలకరింపు కోసం తెలుగు రాష్ట్రాలు తెగ ఎదురు చూస్తున్నాయి.