తెలంగాణలో పొత్తులు లేకుండానే బరిలోకి

పార్టీ గెలుపే లక్ష్యంగా  ప్రణాళిక
బస్సుయాత్రతో ప్రజల్లోకి వెళతాం
రాష్ట్రంలో వచ్చే నెలలో అమిత్‌షా పర్యటన
ఢిల్లీలో లక్ష్మణ్‌ వెల్లడి
న్యూఢిల్లీ,మే14(జ‌నం సాక్షి):  తెలంగాణలో ఎవరితోనూ పొత్తులు ఉండబోవని, అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. అలాగే తెలంగాణలో సిఎం కెసిఆర్‌పై ప్రజలకు భ్రమలు తొలిగాయని అన్నారు. ఓ ప్రణాళిక ప్రకారం పార్టీని ముందుకు తసీఉకుని వెళ్లి విజయం సాధిస్తామని అన్నారు.  ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో భేటీ అనంతరం విూడియాతో మాట్లాడిన ఆయన.. 2019 సార్వత్రిక ఎన్నికలపై అమిత్‌షాతో చర్చించామని చెప్పారు. వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బస్సు యాత్ర చేపడతామని తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రజలకు వివరిస్తామని, రాష్ట్రంలో పార్టీని బూత్‌ స్థాయి నుంచి బలోపేతం చేస్తామని అన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో పార్టీ పరిస్థితిపై నివేదిక సిద్ధం చేస్తున్నామన్నారు. త్వరలోనే తెలంగాణలో అమిత్‌షా పర్యటిస్తారని తెలిపారు. ఇదిలావుంటే దక్షిణాదిలో పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్న బీజేపీ.. అందుకు తెలంగాణను కీలకంగా భావిస్తోంది. రాష్ట్రంలో పాగా వేసేందుకు తగిన రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకుంటోంది. నిన్న మొన్నటి దాకా కర్ణాటక ఎన్నికలతో బిజీగా ఉన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఇక తెలంగాణపై దృష్టి సారించనున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకోనున్నట్లు ఇప్పటికే జోస్యం చెప్పిన నేపథ్యంలో.. పార్టీ ముఖ్యనేతలు అమిత్‌షాతో చర్చించారు. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తోపాటు పలువురు సీనియర్లు ఆదివారం ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ పర్యటన షెడ్యూలు కూడా ఖరారయ్యే అవకాశం ఉంది. పార్టీ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం.. జూన్‌లో రాష్ట్రానికి  రానున్న అమిత్‌షా ఇక్కడ కనీసం మూడు రోజులపాటు మకాం వేసే అవకాశం ఉంది. పార్టీ రాష్ట్ర కార్యాలయమే వేదికగా ఆయన ఎన్నికల వ్యూహాన్ని రచించనున్నారు. మరోవైపు ఎన్నికల సమాయత్తంలో భాగంగా జాతీయ సంఘటన్‌ సంయుక్త ప్రధాన
కార్యదర్శి సతీష్‌ జీ ఈ నెల 17, 18 తేదీల్లో పార్టీ రాష్ట్ర ముఖ్యులతో కీలక సమావేశాలు నిర్వహించ నున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ఎన్నికల వ్యూహంపై ప్రధానంగా చర్చించి దిశానిర్దేశర చేయనున్నారు. ఇందులో భాగంగా పార్టీ నేతల బస్సుయాత్ర రూట్‌మ్యాప్‌ను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. తొలి విడతలో 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, ఆ తర్వాత మిగతా సెగ్మెంట్లలో యాత్ర నిర్వహించనున్నట్లు కె.లక్ష్మణ్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ యాత్రలో వివిధ వర్గాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని లక్ష్కమణ్‌ చెప్పారు