తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాలి..
కల్వకుంట్ల కవిత పాపాలు కడుక్కొని రావాలి
56 శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం రావాల్సిందే
తెలంగాణలో జరిగే ప్రతీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది.
ఖమ్మం ఎంపీగా నేను పోటీ చేస్తున్న
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్
భద్రాద్రి కొత్తగూడెం. జులై 11 (జనం సాక్షి)
తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి ముఖ్యమంత్రి కావాలి అనే బలమైన నినాదంతో జనసేన పార్టీ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నట్లు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ నాయకులు డాక్టర్ శ్రీ గడల శ్రీనివాస్ రావు అధ్యక్షతన ఆదివారం భద్రాద్రి కొత్తగూడెంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కొత్తగూడెంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించి, ర్యాలీగా బయలుదేరి, మార్గం మధ్యలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన అనంతరం వేదిక దగ్గరకు చేరుకున్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్ చేతుల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ చేతుల మీదుగా జనసేన జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తాళ్లూరి రామ్ మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై నిత్యం ఏదో ఒక అసత్యపు ఆరోపణ చేస్తున్న కల్వకుంట్ల కవిత మొదట తమ లిక్కర్ పాపాలు కడుక్కొని రావాలని, పదేళ్లు పాటు పదవులు అనుభవించిన తరువాత తన మాతృపార్టీని, తనతండ్రిని, సోదరుడిని తిడుతున్న కవిత మొదట టీ.ఆర్.ఎస్. బురదను కడుక్కోని రావాలన్నారు. తెలంగాణలో 56 శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం రావాల్సిందేనని పునరుద్ఘాటించారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్ ఎన్నికలతో పాటుగా తెలంగాణలో జరిగే ప్రతీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో ఖమ్మం లోక్ సభ స్థానంలో ఎంపీ అభ్యక్థిగా తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో జనసేన పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఉన్నదని అన్నారు. జనసేనలో చేరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతం చేస్తూ, కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసేందుకు సిద్ధమవుతున్న డాక్టర్ శ్రీ గడల శ్రీనివాస్ రావు, జనసేన శ్రేణులు ఐక్యతతో పనిచేసి పార్టీ బలోపేతం కోసం కృషిచేయాలని చెప్పారు.
ఖమ్మం జిల్లా కార్యకర్తలు అంకితభావం అమూల్యమైనది..
-తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్
జనసేన ప్రస్థానంలో ఖమ్మం జిల్లా కార్యకర్తల అంకితభావం చాలా అమూల్యమైనదని తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ అన్నారు. ఇటీవల జనసేన పార్టీలో చేరిన గడల శ్రీనివాస్ నాయకత్వాన్ని బలపరిచేందుకు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని అన్నారు. తెలంగాణలో అవకాశం ఉన్నంతవరకు ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. రానున్న కాలంలో రాష్ట్రమంతా పర్యటించి పార్టీ బలోపేతం దిశగా పయనించనున్నట్లు వెల్లడించారు.
ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా
-జనసేన ప్రచార కార్యదర్శి శ్రీ సాగర్ ఆర్.కె.నాయుడు
ఉద్యమాల ఖిల్లాగా పేరొందిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎన్నో పోరాటాలకు వేదికగా నిలిచిందని జనసేన ప్రచార కార్యదర్శి శ్రీ సాగర్ ఆర్.కె.నాయుడు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన జెండా ఎగురుతుందని, అన్ని ఎన్నికల్లో పోటీచేసి గెలుస్తామని అన్నారు.
కొత్తగూడెంలో బోణీ కొడతాం
-ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీ గడల శ్రీనివాస్ రావు
తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ జైత్రయాత్రను కొత్తగూడెంలో బోణీ కొట్టి ప్రారంభిస్తామని ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీ గడల శ్రీనివాస్ రావు ప్రకటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తల సహకారంతో పనిచేస్తామని, పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న ప్రతీ ఒక్కరినీ కలిసి, పేరుపేరునా పార్టీలోకి ఆహ్వానిస్తామని అన్నారు.
జనసేన పార్టీ లో చేరిన స్థానిక ప్రజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం, చుంచుపల్లి మండలంలో జరిగిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో జనసేన నాయకులు డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు సమక్షంలో 200 మంది యువకులు, మహిళలు జనసేన పార్టీ లో చేరారు. రాష్ట్ర నాయకులు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఖమ్మం కోఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ, జనసేన రాష్ట్ర నాయకులు మచ్చా సుధాకర్, మేకల సతీష్ రెడ్డి, సురేష్ రెడ్డి, తనీష్, మంథని సంపత్, గోకుల రవీందర్, బండి నరేష్, తాడికొండ లిఖిత, నల్లా సురేష్, దాసరి రవీష్, షేక్ ఫరీద్, విజయ రామారావు, రాము యాదవ్, హసీనా, జయశ్రీ, సాదిక్, తదితరులు పాల్గొన్నారు.



