దీపక్ చౌదరి చొరవతో తొలగిన ట్రాఫిక్‌ అంతరాయం

* మామిళ్లగూడెలో రోడ్డుపై కూలిన భారీ చెట్టు..
* వెంటనే రంగంలోకి దిగిన డీఆర్ఎఫ్

ఖమ్మం, ఆగస్టు 7, (జనంసాక్షి) : ఖమ్మం నగరంలోని 45వ డివిజన్ మామిళ్లగూడెం, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సమీపంలో శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు ఓ భారీ చెట్టు విరిగి ప్రధాన రహదారిపై పడింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నగర అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ నాగండ్ల దీపక్ చౌదరి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు. ఆయన చొరవతో డీఆర్ఎఫ్ బృందం, డివిజన్ జవాన్లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని విరిగిపడిన చెట్టును ముక్కలుగా కోసి రహదారి నుంచి తొలగించారు. అనంతరం రోడ్డును పూర్తిగా శుభ్రం చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరిన నాగండ్ల దీపక్ చౌదరి, సమస్య పరిష్కారమయ్యే వరకు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆయన చొరవతో వేగంగా స్పందించిన డీఆర్ఎఫ్ సిబ్బంది, డివిజన్ జవాన్లను స్థానికులు అభినందించారు.