అన్నారం షరీఫ్‌లో రెండు వైన్స్ షాపుల్లో చోరీ..

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

పర్వతగిరి, ఆగస్టు 6: జనం సాక్షి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో గురువారం తెల్లవారుజామున రెండు వైన్స్ షాపుల్లో చోరీ జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామంలోని వెంకటేశ్వర వైన్స్ మరియు దుర్గ శ్రీ వైన్స్ దుకాణాలను లక్ష్యంగా చేసుకున్న దుండగులు చోరీకి పాల్పడ్డారు. దుండగులు ముందుగా సీసీ కెమెరాలకు అనుసంధానంగా ఉన్న కరెంట్ వైర్లను తొలగించి, అనంతరం షాపు వెనుక భాగంలోని డోర్ గ్రిల్స్‌ను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది. చోరీకి గురైన నగదు, మద్యం సీసాలు లేదా ఇతర ఆస్తుల విలువపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీటీవీ వ్యవస్థను ధ్వంసం చేయడంతో పాటు దుండగులు అనుసరించిన విధానంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. చోరీ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నష్టం అంచనా మరియు దుండగుల ఆచూకీపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.