తెలంగాణలో మళ్లీ అధికారం టిఆర్‌ఎస్‌దే

 

మన ముఖ్యమంత్రి కెసిఆరే

విపక్ష కూటములను నమ్మొద్దు: కొప్పుల

జగిత్యాల,నవంబర్‌2(జ‌నంసాక్షి): త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేననీ ధర్మపురి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కొపపుల ఈశ్వర్‌ అన్నారు. మహాకూటమిని ప్రజలు నమ్మరని అన్నారు. కాంగ్రెస్‌,టిడిపిలవి అవకాశవాద రాజకీయాలని విమర్శించారు. ఏ ప్లలెకు వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం స్థానిక నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కేసీఆర్‌ కృషి చేస్తున్నారనీ, అందుకు బాసటగా నిలవాల్సిన అవసరం తెలంగాణ బిడ్డలపై ఉందన్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్‌ చచ్చుడో అనే నినాదంతో చివరికి ప్రాణాలను సైతం పణంగా పెట్టి సాధించారని అన్నారు. దానిని మరచిన కొందరు కూటములు కట్టి వస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్‌ వన్‌ స్థానంలో నాలుగేళ్లుగా నిలుస్తుందన్నారు. కేసీఆర్‌పై ఉన్న నమ్మకంతోనే ప్రజలు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏ ప్లలెకు తండాకు వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు.సాగునీటి విషయంలో కాంగ్రెస్‌, టీడీపీలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారనీ అన్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల విూదనే ప్రభుత్వం వేలాది రూపాయల కోట్లు కేటాయించిందన్నారు. విడిపోతే చెడిపోతారు అని ఎద్దేవా చేసినవారే ఇప్పుటి వరకు జరిగిన అభివృద్ధిని, నాలుగేళ్లుగా సాధించిన ప్రగతిని చూసి ఏమిచేయాలో తెలియక బిత్తరపోతున్నారని వివరించారు.మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథలు ప్రపంచదేశాలకే రోల్‌మోడల్‌గా నిలిచాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు భారీదని చెప్పారు. రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ఎస్సారెస్పీని నిండుకుండలా మార్చుతున్నామని తెలిపారు.అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ బిడ్డలంతా కృషి చేస్తూ మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలనీ ఈశ్వర్‌ పిలుపునిచ్చారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ కార్యకర్తలు,నాయకులు సరిగ్గా పనిచేస్తే ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమన్నారు. సమైక్య పాలనలో దగాపడ్డ తెలంగాణ గురించి ప్రజలకు వివరించాలన్నారు. అలాగే అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని గుర్తు చేయాలని వివరించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 100 ఎమ్మెల్యే సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి సారించారన్నారు.