తెలంగాణ ఆకాంక్షల మేరకే అభివృద్ది


కూటమి నేతల విమర్శల్లో అర్థం లేదు: కొప్పుల
జగిత్యాల,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): నీళ్లు, నిధులు, నియామకాల సాధనే లక్ష్యంగా కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారని, ఆ కలను సాకారం చేసే దిశగా ముందుకు సాగారని ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. తెలంగాణ జాతిని ఏకతాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించారన్నారు. ప్రస్తుతం అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ విరివిగా నిధులు మంజూరు చేస్తున్నారన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి నిధుల కేటాయింపులో పూర్తిగా అన్యాయం జరిగిందని.. స్వరాష్ట్రం వచ్చాక వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. గతంలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు  నిధులు కూడా మంజూరు చేయించుకోలేని దుస్థితి ఉండేదన్నారు. తెలంగాణ ప్రాంతమంతా తీవ్రంగా నష్టపోయిందన్నారు. నాలుగేళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మిషన్‌ భగీరథతో త్వరలో ఇంటింటికీ నల్లా నీటిని కూడా అందిస్తామన్నారు. అభివృద్ధి చేసి చూపించిన టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు అండగా నిలవాలని కోరారు.  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక
స్థానాలు గెలుచుకొని ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటువేస్తే మురుగిపోయినట్లేనన్నారు. కేవలం టీఆర్‌ఎస్‌ పార్టీని విమర్శిస్తే   కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు పడతాయని అనుకోవటం ఆ పార్టీ నాయకుల మూర్ఖత్వం అవుతుందన్నారు. గత 60 ఏండ్లలో రాష్ట్రాన్ని నాశనం చేసిన టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు మళ్లీ కలిసి పోటీ చేయటం విడ్డూరంగా ఉందన్నారు. అన్ని రంగాలల్లో తెలంగాణను ముందుచిన  కెసిఆర్‌ను గెలిపించుకోవాల్సిన భాద్యత మనపై ఉందన్నారు.