తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు కీలకం
నిజామాబాద్, జనవరి 19 : తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని, ఈ నెల 28న తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే ఉపాధ్యాయ లోకం ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్సీ పిఆర్‌టియు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవడం వల్లే అందుకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకోబోతుందని ఆయన వెల్లడించారు. తెలంగాణకు అడ్డుపడేందుకు కొన్ని శక్తులు కుట్రపన్నుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాయి. ఉద్యోగుల పదవ పిఆర్సీని ప్రకటించేందుకు ప్రభుత్వంపై తనవంతుగా ఒత్తిడి తెస్తానని అన్నారు. ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు. 9వ పిఆర్సీలో సీనియర్ ఉపాధ్యాయులకు జరిగిన నష్టాన్ని పదవ పిఆర్సీలో భర్తీ చేయాలని ఆయన కోరారు. ఈ ధర్నాలో పిఆర్‌టియు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.