తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దిగ్గజాలు 

తెలంగాణ ఎన్నికల కురుక్షేత్రం క్రమంగా వేడెక్కుతోంది. అనునిత్యం ప్రచార వేడితో ఉత్కంఠ దశకు చేరుకుంటోంది. ఆయా పార్టీల నుంచి ప్రముఖులంతా తెలంగాణలో మకాం వేశారు. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేయడంతో ప్రజల నాడి పట్టడం ఇప్పుడే అంత సులువు కాదన్నట్లుగా ఉంది. ప్రజలు కూడా ఎటువైపు అన్నది పార్టీలు తేల్చుకోలేకపోతున్నాయి. ఆయా పార్టీల ప్రచారం ఎవరికి తీసిపోకుండా సాగుతోంది. తెలంగాణ ఏర్పడ్డ తరవాత కొలువుదీరిని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని 9 నెలలముందే రద్దు చేస్తూ కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్న సెప్టెంబర్‌ 6 నుంచి వేడెక్కుతూ వస్తున్న రాష్ట్ర రాజకీయం తుది అంకానికి చేరుకుంది. పోలింగ్‌కు మరో ఐదురోజులే మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీలు, ఆయా పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్‌ నెలకొంది. ఈ ఐదు రోజుల కష్టంపైనే రానున్న ఐదేళ్ల రాజకీయ భవిష్యత్‌ ఆధారపడి ఉండడంతో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రచార గడువు సవిూపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు తమ వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌లో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌, కీలక నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌,కవితలు రాష్ట్రమంతా చుట్టివస్తూ ప్రత్యర్థులపై మాటల దాడులు చేస్తున్నారు. తాము చేసిన అభివృద్ధి చెప్పడంతో పాటు తెలంగాణ భవిష్యత్‌ పదిలంగా ఉండా లంటే మరోవైపు చూడవద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అందుకే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిల నుంచి పార్టీ ప్రముఖులంతా ప్రచారక్షేత్రంలో దూకారు. దీంతో తనను ఒంటరి చేసి అంతా ఒక్కటయ్యారని కెసిఆర్‌ ఆందోళన చెందుతున్నారు. తనను ఒక్కడిని ఎదురకోవడానికి ఇంతమందా అని జనం ముందు వేదన వెళ్లగక్కుతున్నారు. ఇక విూరే నాకురక్ష అంటూ ప్రచార సభల్లో వేడుకుంటున్నారు. తెలంగాణ కోసం నానాకష్టాలు పడి సాధించానని చెప్పుకుంటున్నారు. ఈ దశలో తెలంగాణ కోసం ఎందరో త్యాగం చేసిన విషయాన్‌ఇన మరుగన పరచి తానొక్కిడినే మృత్యువు నోట్లో తలపెట్టి తెచ్చానని చెబుతున్నారు. నిజానికి ఎందరో మృత్యువుకు బలయిన సంగతి పెద్దగా ప్రచారం చేయడం లేదు. ఇప్పుడు తనకు వ్యతిరేకంగ ఆఉన్న వారిలో కోదండరామ్‌, గద్దర్‌, మందకసృ/-ణ మాదిగ, కాంగ్రెస్‌ సహా అంతా తెలంగాణ కోసం కొట్లాడారన్న విషయాన్‌ఇన పక్కన పెట్టి తనొక్కడి ఘనకార్యంగానే తెలంగాణ వచ్చిందన్న ప్రచారం చేపట్టారు. తెలంగాణ వచ్చిన 2014లో ప్రజలు కెసిఆర్‌ను నమ్మి ఓటేశారు. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ మళ్లీ రగిల్చినా ప్రజల్లో పెద్దగ ఆస్పందన రావడం లేదు. నాలుగేళ్లో ఏం చేశారన్నదానితో ఆపటు ప్రజలు కూడా తమ ఆత్మగౌరవం గురించి మాట్లాడుకుంటున్నారు. కెసిఆర్‌ను నియంతగా పోలిస్తే దానికి సమాధానం రావడం లేదు.అందుకే విపక్షాలు నియంతృత్వం, కుటుంబపాలనపైనే ప్రధానంగా అస్త్రాలు సంధిస్తున్నారు. మరోవైపు  ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు తాము పడుతున్న పాట్లు ఎలాంటి ఫలితాన్నిస్తా యోనన్న ఆలోచన అన్ని పార్టీల అభ్యర్థులకు కంట నిద్ర లేకుండా చేస్తోంది. కాంగ్రెస్‌ నుంచి ఇప్పటికే సోనియా,రాహుల్‌ ప్రచారం చేసి వెళ్లారు. కాంగ్రెస్‌ దిగ్గజాలు ఆజాద్‌, కుంతియా, ఖర్గే, జైరామ్‌ రమేశ్‌, అజారుద్దీన్‌, ఖుష్బూ, విజయశాంతి తదితరులు రంగంలోకి దిగారు. కోదండరామ్‌, గద్దర్‌, మందకృష్ణ వారికి తోడుగా ప్రచారంలో ఉన్నారు. ఇక బిజెపి నుంచి ప్రధాని మోడీ, అమిత్‌ షా, సుష్మాస్వరాజ్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌, నడ్డా, తదితరులు కూడా రావడంతో ప్రచారం వేడెక్కింది. ఇన్నాళ్లూ అభ్యర్థుల ఎంపిక, పొత్తుల కసరత్తుతో కాలం గడిచినా గత వారం రోజులుగా తెలంగాణ పల్లెల్లో జోరుగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష ప్రజాకూటమితో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నిద్రాహారాలు మాని పల్లెల్లో తిరుగుతున్నారు. ఊరూ వాడా తిరుగుతూ తమకు ఓటేయాలని ఓటర్లను వేడుకుంటున్నారు.
ఓటర్లను ఆకర్షించేందుకు అనేక ఫీట్లు చేస్తూ పాట్లు పడుతున్నారు. అనేక హావిూలను గుప్పిస్తున్నారు. ఈ అభ్యర్థులకు తోడు రాష్ట్ర, జాతీయ నేతలు కూడా ప్రచారపర్వంలోకి అడుగుపెట్టటంతో గత ఐదారు రోజులుగా ఎన్నికల ప్రచారం మార్మోగిపోతోంది. ఓ వైపు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రోజుకు నాలుగైదు నియోజకవర్గాలను చకచకా చుట్టేస్తుండగా, ఇటు ప్రధాని నరేంద్రమోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ కీలక నేత సోనియాగాంధీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్‌ షా, వివిధ పార్టీల అగ్రనేతలు సుష్మా స్వరాజ్‌, గులాంనబీ ఆజాద్‌, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, బీఎస్పీ అధినేత మాయావతి లాంటి నేతలు రాష్ట్రానికి  రావడంతో ప్రచార సందడి నెలకొంది.  కాంగ్రెస్‌ పక్షాన రాహుల్‌, సోనియాగాంధీలతో పాటు కూటమి నేతలు చంద్రబాబు, ఉత్తమ్‌, కోదండరాం, రేవంత్‌రెడ్డిలు అధికార పార్టీ శిబిరంపై మాటల తూటాలతో ప్రచారానికి పదును పెడుతున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌షాలూ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లను విమర్శిస్తుండటం, వారికి కేసీఆర్‌, రాహుల్‌ కౌంటర్‌లు ఇస్తుండటంతో ఎన్నికల ప్రచార పర్వం రసకందాయంగా సాగుతోంది.  ఎవరెన్ని మాటలు చెప్పినా, ఎంత ప్రచారం చేసినా ఎన్నికలకు ముందు రెండ్రోజులు ఎలా ఉంటుందనేది ప్రధానం కానుంది.  ప్రచారం డిసెంబర్‌ 5 నాటికి ప్రచారం పూర్తవుతుం డటంతో అంతకంటే ముందు రెండ్రోజులు, ఆ తర్వాతి రెండ్రోజులే కీలకంగా మారాయి. ఓటర్లనుతమవైపు తిప్పుకునేందుకు తాయిలాలిచ్చే సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. వీలున్నంత మేర డబ్బు, మద్యం పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకునే దిశలో అడుగులు వేస్తున్నది.మొత్తంగా ప్రచారం తారాస్తాయికి చేరిన క్రమంలో ఓటర్లు ఎటు వైపు అన్నది ఎన్నికల ఫలితాల తరవాతనే తేలనుంది.