తెలంగాణ కవాతు సందర్భంగా
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (జనంసాక్షి) :
తెలంగాణ ఉద్యమం మరో మలుపు తీసుకుంది .. సాగరహారం జనసంద్రమై హోరెత్తుతున్నది. తెలంగాణ ఉద్యమ కెరటాలు పరవళ్లు తొక్కుతూ ఎగిసి పడుతున్నది. ఈజిప్టులో, సిరియాలో నియంత పాలకులను కళ్లు తెరిపించినట్లుతగా తెలంగాణ ఉద్యమం సాగుతుంది. నక్లెస్ రోడ్‌లో సాగరహారం లక్షలాది మంది తెలంగాణ వాదులతో కిక్కిరిసిపోయింది. అడుగుగడుగునా పోలీసులు సృష్టించిన ఆటంకాలను తెలంగాణవాదులు ఎదుర్కొని సభావేదికకు నిర్ణిత సమం కంటే ముందే చేరుకున్నారు. తెలంగాణ అంతటా రైళ్లు, బస్సులను ప్రభుత్వం రద్దు చేసుకున్నప్పటి ప్రత్యామ్నాయంతో ఉద్యమకారులు నక్లెస్‌రోడ్ చేరుకున్నారు. పోలీసులు మార్చ్‌కు అనుమతించినప్పటికి హైదరాబాద్‌కు ఉన్న నాలుగువైపులున్న రహదారులన్నీ దిగ్భందం చేసి ఎక్కడికక్కడే ఉద్యమకారులను అడ్డుకున్నారు. ఒక్కొక్కరుగానే పోగై పోలీసు వలయాలను ఛేదించి పోలీసు నిఘా కళ్లకు మట్టికొట్టి ఉద్యమకారులు సాగరహారానికి చేరుకున్నారు. ఓయూలో ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులపై భాష్పవాయులు ప్రయోగించారు.యూనివర్సిటీ లోపలికి పోలీసులు వెళ్ల రాదన్న నిబంధనను అతిక్రమించి ప్రాంగణంలోకి లాఠీలను ఝలిపించడం లెక్కలేనన్ని సార్లు భాష్పవాయులు గోళాలను ప్రయోగించారు. అక్కడ అంతా టీయర్ గ్యాస్‌తో నిండిపోయింది. తెలంగాణ అంతటా జరుగుతున్న అరెస్టులను పోలీసు దమన కాండనను నిరసిస్తూ సీఎం కార్యలయం ముందు టీ ఎంపీలు ధర్నా చేపట్టారు. ప్రజా స్వామ్య దేశంలో ఎంపీలను సీఎంను కలవనివ్వకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. కోపోద్రేక్తుడైన ఎంపీ మధుయాస్కీ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. రాష్ట్రంలో గవర్నర్ పాలన సాగుతుందా, పోలీసు రాజ్యం సాగుతుందా కాల్ సీఎం ఆంటూ తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. హైదరాబాద్ వీధులన్నీ తెలంగాణవాదులతో నిండిపోయాయి. గణేష్ నిమర్జనం వరకు తెలంగాణవాదులంతా సంయమనం పాటించి శాంతియుతంగా జరిగేలా సహకరించారు. ఖైరతాబాద్ ప్రాంతంలో సాగరహారాన్ని వస్తున్న ప్రజలపై ,వృద్దులపై విచక్షనా రహితంగా పోలీసులు లాఠీ చార్చి చేశారు. సీఎం క్యాంపు వద్ద మీడియా ప్రతినిధులపై లాఠీలు ఝులిపించారు. ఈ లాఠీ చార్చీలో ఎబీఎన్ ఆంద్రజ్యోతి విడియో జర్నలిస్టు వెంకట్ తీవ్రంగా గాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకున్న జీవకారణ్య సదస్సు పై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. హైదరాబాద్ అన్ని వీధులో టియర్ గ్యాస్ మోతలు హోరెతుత్తున్నయ్. హైదరాబద్‌లో సీమ పోలీసులు తెలంగాణ వాదులపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రకటించే వరకు నక్లెస్ రోడ్ వదిలేది లేదని న్యూయార్క్‌లో ఆక్‌పై వాల్‌స్ట్రీట్ మువ్‌మెంట్ తరహాలో తెలంగాణ ఉద్యమాన్ని చేయాలన్నది కనబడుతున్నది. కడపటి వార్తలు అందే సరికి నక్లెస్ రోడ్‌లో మూడు లక్షలకు పై చిలుకు జనాబా పోగయ్యారన్ని ప్రభుత్వ అంచనా వేస్తున్నాయి. కేంద్రం తెలంగాణపై అవలంభిస్తున్న నాన్చుడు దోరని పై నిరసనగా ఈ మార్చ్ కొనసాతుగున్నదని తెలుసు ఒక దశలో సచ్‌వాలయంలోకి తెలంగాణవాదులు దూసుకుళ్లేందుకు ప్రయత్నించారు. సచ్‌వాలయంలో, అసెంబ్లీలో వెళ్లి కూర్చోవాలన్నది వ్యూహంగా కనబడుతున్నది.
తెలంగాణ కవాతు సందర్భంగా భారీ బందోబస్తు
హైదరాబాద్: ఆదివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో జరగనున్న తెలంగాణ కవాతు సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం రాత్రే హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి. డీజీపీ దినేష్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ తదితరులు కవాతు నిర్వహించే నెక్లెస్ రోడ్ ప్రాంతంలో పర్యటించారు. కవాతు సందర్భంగా బందోబస్తు ఎలా ఉండాలనే దానిపై శనివారం పోలీసు ఉన్నతాధికారులు సమావేశమై చర్చించారు. 10 వేలమందికి పైగా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. గణేష్ నిమజ్జనం నేపధ్యంలో నెక్లెస్‌రోడ్డు, ట్యాంకు బండ్ వద్ద పోలీసు బందోబస్తు ఉంది కవాతు బందోబస్తుకు వారి స్థానంలో కొత్తవారు విధుల్లోకి రానున్నారు. గణేష్ నిమజ్జనం కోసం విధించిన ట్రాఫిక్ ఆంక్షలు ఆదివారం కూడా కొనసాగించాలని నిర్ణయించారు.
నెక్లెస్ రోడ్డుకు ర్యాలీగా చేరుకోనున్న కార్యకర్తలు, నేతలు
హైదరాబాద్: తెలంగాణ కవాతుకు మధాహ్యం 12 గంటల నుంచి నెక్లెస్ రోడ్డుకు పలు సంఘాలు ర్యాలీగా చేరుకోనున్నారు. ఒంటిగంటకు 15 వేల మందితో జూబ్లీ బస్టాండ్ నుంచి నెక్లెస్ రోడ్డుకు తెరాస నేత హరీష్‌రావు నేతృత్వంలో 15 వేల మంది కార్యకర్తలు చేరుకోనున్నారు. తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ ఆధ్వర్యంలో, ఇందిరాపార్కు నుంచి సీపీఐ. భాజపా ఆధ్వర్యంలో, సికింద్రాబాద్ క్లాక్‌టవర్ నుంచి న్యూడెమోక్రసీ, తెలంగాణ జాగృతి కార్యకర్తలు ర్యాలీగా నెక్లెస్ రోడ్డుకు రానున్నారు. సికింద్రాబాద్ మింట్ కాంపౌడ్ నుంచి విద్యుత్ ఉద్యోగులు , మధ్యాహ్నం 12.30కు గన్‌పార్కు నుంచి తెలంగాణ జర్నలిస్టుల సంఘం నేతలు, 2 గంటలకు అక్కడి నుంచి తెలంగాణ ఉద్యోగ సంఘాలు, పబ్లిక్ గార్డెన్ నుంచి తెలంగాణ ఉపాధ్యాయులు ర్యాలీగా నెక్లెస్ రోడ్డుకు వస్తున్నారు.
‘తెలంగాణ మార్చ్’కు రాకుండా రైళ్లు రద్దు
హైదరాబాద్: తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇచ్చినట్లు పైకి గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, మార్చ్‌కు ప్రజలు రాకుండా అడ్డుకునేందుకు లోపాయికారిగా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నదన్న విమర్శిలు వినిపిస్తున్నాయి. సాధారణ ప్రజానీకం ఎక్కువగా ఆధారపడే పలు ప్యాసింజర్ రైళ్లు ఆదివారం తిరగకుండా రద్దు చేసింది. ఇతర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లకు వచ్చే పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, మరికొన్నింటిని తెలంగాణ జిల్లాల్లోకి ప్రవేశించకుండా వెనుతిరిగి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే శనివారం రైళ్ల రద్దు, తాత్కాలిక రద్దుల వివరాలను తెలియజేస్తూ ప్రకటన జారీ చేసింది. అయితే రైళ్ల రద్దుకు నిర్దిష్టమైన కారణాలేమి ఈ ప్రకటనలో చెప్పలేదు. వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా, రైల్వే వర్గాల ఫోన్లు పని చేయకపోవడం గమనార్హం. కేవలం ‘ఆపరేషనల్ రీజన్స్’ అంటూ చెప్పి తెలంగాణ ప్రజలు హైదరాబాద్ రాకుండా అడ్డుకునేందుకు కుట్ర పన్నారని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. గుంటూరువైపు నుంచి సికింద్రాబాద్ వచ్చే రెండు రైళ్లను సీమాంధ్ర సరిహద్దు వరకే పరిమితం చేశారు. తెలంగాణ జిల్లాలోకి రాకుండా సరిహద్దు నుంచి వెనక్కి పంపించేస్తున్నారు. అలాగే ఔరంగాబాద్, నాందేడ్, బీజ్‌పూర్ నుంచి వచ్చే ప్యాసింజర్ రైళ్లు కూడా తెలంగాణలోకి రాకుండా సరిహద్దుల నుంచి వెనక్కి మల్లించారు.
తెలంగాణ జేఏసీ అత్యవసర భేటీ
హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో అరెస్టుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయ జేఏసీ అత్యవసరంగా సమావేశం అయింది. అక్రమ అరెస్టులపై చర్చించి ప్రభుత్వానికి, డీజీపీకి, హోంమంత్రికి ఫిర్యాదు చేయనున్నారు. అనుమతిచ్చినా కూడా అరెస్టులు ఎందుకు చేస్తున్నారని జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ కవాతుకు వస్తున్న 200 మంది అరెస్టు
నల్గొండ: తెలంగాణ కవాతు కోసం నల్గొండ జిల్లా నుంచి వస్తున్న వివిధ పార్టీలకు చెందిన 200 మంది ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు నేతల ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకుంటున్నారు. గతంలో జరిగిన ఉద్యమాల్లో వీరిపై కేసులు ఉన్నాయని అందుకే అదుపులోకి తీసుకుంటున్నామని పోలీసులు తెలిజేశారు. ఎక్కువగా నకరేకల్‌లో 17 మంది, హాలీయలో 15 మంది, సాగర్‌లో 15 మంది ,వలిగొండలో 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు నేతలు తెలియజేశారు. అరెస్టయిన వారిలో జిల్లా తెరాస అధ్యక్షుడు బండా నరేంద్రరెడ్డి, మహిళా అధ్యక్షురాలు శరణ్యారెడ్డి తదితరులు ఉన్నారు.
మార్చ్‌పై పోలీస్‌ల ఓవరాక్షన్
హైదరాబాద్: సీఎం కిరణ్ సర్కార్ ‘ మార్చ్’ కు అనుమతి ఇచ్చినా తెలంగాణ జిల్లాల్లో పోలీసులు జులుం కొనసాగుతూనే ఉంది. పల్లెల నుంచి నగరానికి తరలివస్తున్న తెలంగాణ వాదులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. పోలీసులను అరెస్టులపై తెలంగాణ వాదులు ప్రశ్నిస్తే ప్రభుత్వం, డీజీపీ ఆదేశాల మేరకే నడుచుకుంటున్నామని చెబుతున్నారు. మార్చ్‌ను విఫలయత్నం చేసేందుకు పోలీసులు తీవ్రంగా కుట్రలు పన్నుతున్నారు. జిల్లాల నుంచి వచ్చే వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు. అయినా కూడా తెలంగాణ వాదులు పట్టు వీడకుండా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు.
తెలంగాణవాదులను రెచ్చగొడితే నష్టపోయేది ప్రభుత్వమే: స్వామిగౌడ్
హైదరాబాద్: తెలంగాణవాదులను రెచ్చగొడితే నష్టపోయేది ప్రభుత్వమేనని జేఏసీ నేత స్వామిగౌడ్ హెచ్చరించారు. మార్చ్‌కు అడ్డంకులు సృష్టిస్తే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణవాదుల పట్ల ప్రభుత్వం నీజాతినీతిగా ప్రవర్తిస్తున్నదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చ్‌కు అనుమతిచ్చి అరెస్టులు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ కుటిల నీతికి అరెస్టులే నిదర్శనమని ధ్వజమెత్తారు.
ఓయూ విద్యార్థుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్: తెలంగాణ కవాతులో పాల్గొనేందుకు ఉస్మానియా విద్యార్థులు ర్యాలీగా బయలుదేరారు. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను ఎన్‌సీసీ గేటు వద్ద భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు.
అనుమతి ఇవ్వటంలోనే కుట్ర: కోమటి రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ మార్చ్‌కు అనుమతి పేరున తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రికి కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్ర పన్నినట్టు కనబడుతోందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. మార్చ్‌కు అనుమతి లేదని కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రజలను అరెస్టు చేసి స్టేషన్లలో నిర్భంధించి వేధించారని ఆయన ధ్వజమెత్తారు. ఇన్ని నిర్భంధాల మధ్య ప్రజలు లక్షాలదిగా కదిలే అవకాశం ఉందని నివేదికలు అందడంతో తెలంగాణ మంత్రులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్ర పన్ని అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి మోసం చేశారని పేర్కొన్నారు. రైళ్లును బంద్ చేయడం, బస్సులను నడపనీయక పోవడం, కాలిరడకన వచ్చే వాళ్లను పోలీసులు అరెస్టు చేసి నిర్బందిండమేంటని ఆయన ప్రశ్నించారు. మంత్రులు అనుమతిప్పించామని చంకలు గుద్దుకోవడం కాదు, మీ మాటలను లెక్క చేయకుండా అరెస్టులతో అడ్డుకుంటుంటే ప్రభుత్వంలో ఉండేదుకు సిగ్గుండాలని ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ సీమాంధ్ర పాలకుల కుట్రలలో భాగం కాలేకనే రాజీనామా చేసి బయటకు వచ్చి ప్రజలతో ఉన్నానని ఆయన వివరించారు. ఇకనైన తెలంగాణ మంత్రులు కండ్లు తెరిచి బయటకు రావాలని డిమాండ్ వ్యక్తం చేశారు.
తెలంగాణ పల్లెలకు విద్యుత్ నిలిపివేసిన :సర్కార్
హైదరాబాద్: ఇవాళ తెలంగాణ మార్చ్ నేపథ్యంలో తెలంగాణ పల్లెలకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. మార్చ్‌కు రాలేనివారు టీవీల ద్వారా సమాచారం తెలుసుకునేందుకు వీలు లేకుండా సర్కారు కుట్ర పన్నిందని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. ఎక్కుడ ఏం జరుగుతుందో తెలియకుండా ఉండేందుకు సర్కార్ విద్యుత్ సరఫరా నిలిపివేసిందని వారు అంటున్నారు. తాము సహనం కోల్పేయేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. మధ్యాహ్నంలోగా కరెంట్‌ను సరఫరా చేయాలని డిమాండ్ వ్యక్తం చేశారు.
ఎంపీ వివేక్ నివాసంలో తెలంగాణ, కాంగ్రెస్ ఎంపీలు భేటీ
హైదరాబాద్: పెద్దపల్లి ఎంపీ వివేక్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సమావేశమయ్యారు. తెలంగాణ మార్చ్‌లో పాల్గోనే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ మంత్రులు , ఎంపీలు పదవులకు రాజీనామా చేసి మార్చ్‌లో పాల్గోనాలని ప్రజాసంఘాలు, విద్యార్ధి సంఘాలు హెచ్చరించిన విషయం తెలిసింది.
మార్చ్‌కు మద్దతుగా వరంగల్లు జైల్లో రాజకీయ ఖైదీల దీక్ష
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అపూర్వంగా జరిగే తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా వరంగల్ సెంట్రల్ జైల్లో మావోయిస్టు పార్టీ చెందిన రాజకీయ ఖైదీలు, ఇతర ఖైదీలు దీక్ష చేపట్టారు. తెలంగాణ రాఫ్ట్రాని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ ఆకాంక్షలను జైలు గోడలు ఆపలేవని తాము ఈ దీక్ష చేపట్టినట్టు వారు తమ సందేశాన్ని మీడియా కు పంపించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు కదిలి మార్చ్‌ను విజయవతం చేయాలని కోరారు. పోలీసులు అడ్డుకుంటే ఎక్కడికక్కడ మార్చ్ చేయాల్సిందేనని అన్నారు. ఈ దీక్ష చేపట్టిన వారిలో వారణాసి సుబ్రమణ్యం, జైల్లోనే ఉన్న టీపీఎఫ్ ప్రధాని కార్యదర్శి నలమాస కృష్ణ తదితర రాజకీయ ఖైదీలు ఉన్నారు.
ఓ చేత్తో అనుమతిచ్చి…మరో చేత్తో అడ్డగిస్తున్నారు: కోదండరాం
హైదరాబాద్: ప్రభుత్వం కవాతు నిర్వహించుకోవడానికి ఓ చేత్తో అనుమతి ఇచ్చి.. మరో చేత్తో అడ్డగిస్తోందని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం ధ్వజమెత్తారు. కవాతు భయంతో పాలన నిర్వహించుకోలేక సచివాలయం మొదలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం తాళాలు వేసుకుందని ఆయన విమర్శించారు. కవాతుకు వస్తున్న నేతలను, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇలా వ్యవహరించడం దారుణమన్నారు.
ఓయూలో భాష్ప వాయు ప్రయోగం
హైదరాబాద్: మార్చ్‌కు ర్యాలీగా బయల్దేరిన ఓయూ విద్యార్థులపై పోలీసులు భాష్పవాయు ప్రయోగం జరిపారు. భాష్పవాయు ప్రయోగం జరువుతూనే విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. పలువురి విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌సీసీ గేటు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఓయూ జేఏసీ నేతలు ధ్వజమెత్తారు. తాము ఎలాంటి హింసకు పాల్పడమని చెప్పినా కూడా తమను నెక్లెస్ రోడ్డుకు వెళ్లేందుకు అనుమతించడం లేదని వాపోతున్నారు. మార్చ్‌కు అనుమతిచ్చి ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలకు తెలంగాణ మంత్రులే బాధ్యత వహించాలని డిమాండ్ వ్యక్తం చేశారు.
ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డ తెలంగాణ ఎంపీలు
హైదరాబాద్: కవాతులో పాల్గొనేందుకు జిల్లాల నుంచి వస్తున్న నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మండిపడ్డారు. ప్రభుత్వవైఖరికి నిరసనగా సీఎం క్యాంపు కార్యాలయం ముందు ఎంపీలు ధర్నా చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నాకు ఎంపీల యత్నం
హైదరాబాద్: కవాతులో పాల్గొనేందుకు వస్తున్న నేతలను పోలీసులు అడ్డుకోవడంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా మధుయాస్కీ, వివేక్, పొన్నం, గుత్తా, రాజయ్య తదితర ఎంపీలు సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ధర్నాకు యత్నించారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ ఎంపీలను అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో క్యాంపు కార్యాలయం ఎదుట ఎంపీలు భైఠాయించి ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
క్లాక్‌టవర్ నుంచి ర్యాలీగా బయలుదేరిన కవిత
హైదరాబాద్: తెలంగాణ వచ్చే వరకూ పోరాటం సాగిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తెలంగాణ కవాతుకు మద్దతుగా సికింద్రాబాద్ క్లాక్‌టవర్ నుంచి కార్యకర్తలతో ఆమె ర్యాలీగా బయలుదేరారు. కవాతును అడ్డు కోవద్దని ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇది శాంతియుతంగా జరిగే కవాతు అని అందరూ సహకరించాలని కోరారు.
అసెంబ్లీ ఎదుట తెదేపా ఎమ్మెల్యేల రాస్తారోకో
హైదరాబాద్: కవాతుకు వస్తున్న తెలంగాణవాదులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ తెదేపా ఎంపీలు అసెంబ్లీ ముందు రాస్తారోకోకు దిగారు. అయితే ఇక్కడ అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు.
టీ ఎంపీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్: తెలంగాణవాదుల అరెస్టులను నిరసిస్తూ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ధర్నాకు యత్నించిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఎన్.ఆర్. నగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు ఎంపీలు పోలీసుల చర్యకు నిరసనగా క్యాంపు కార్యలయం వద్ద రోడ్డుపై భైఠాయించారు.
తెలంగాణ భవన్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.