తెలంగాణ కోసం అందరం ఏకమవుదాం

హైద్రాబాద్‌, నవంబర్‌11(జనంసాక్షి):
తెలంగాణ సాధన కోసం అన్ని పార్టీల నేతలు ఏకం కావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ కె కేశవరావు అభిప్రాయపడ్డారు. జెండాలు, అజెండాలు పక్కన పెట్టి అందరూ తెలంగాణ కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ అందరినీ కలుపుకొని వెళ్లాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కె.కేశవరావు అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన తెలంగాణ ప్రజల ఆకాంక్ష అన్నారు. దాని కోసం తెలంగాణ రాజకీయ నేతలంతా కలిసిరావాల న్నారు. తెలంగాణ ఉద్యమం, ఎన్నికలు వేర్వేరు కాదన్నారు. తెలంగాణ నేతలను విభజించేందుకు సీమాంధ్ర నేతలు కుట్రపన్నుతారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ పాత్ర కీలకమైందన్నారు. అందుకే ఉద్యమాన్ని కేసీఆర్‌ ముందుండి నడిపిస్తే తెలంగాణ ఎంపీ లంతా ఆయనకు సహకరిస్తారన్నారు. అంతేకా కుండా డిసెంబర్‌ 9 లోపు తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. గతంలో తెలంగాణ ప్రజల పోరాటం మూలకంగానే ప్రభుత్వం డిసెంబర్‌9 ప్రకటన చేసిందన్నారు. అయితే ఆ ప్రకటన వెలువడి మూడేళ్లు గడుస్తున్నా ఇంత వరకు ఆ దిశగా చర్యలు తీసుకోవడం బాధాకరమన్నారు. ఇక ఆలస్యం చేయడం తగదన్నారు. తెలంగాణ జాప్యాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని, కావున ఈ అంశాన్ని త్వరగా పరిష్కారించాలన్నారు. ఇదే అంశంపై అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాస్తామని చెప్పారు. ఈ లేఖలో తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. తెలంగాణ అంశంలో తమకు సహనం నశించిపోయిందన్నారు. ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ నేతలను విభజించేందుకు కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కాంగ్రెస్‌ పార్టీలో టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తామని కేసీఆర్‌ చేసిన ఆఫర్‌ గొప్ప త్యాగంతో కూడుకున్నదన్నారు. ఈ ప్రాంతంలోని మొత్తం అసెంబ్లీ, ఎంపీ స్థానాల్లో 90 అసెంబ్లీ, 16 ఎంపీ సీట్లను కైవసం చేసుఉకునే వారే తెలంగాణ కార్యసాధకులని చెప్పారు.