పదేళ్లలో ఏం పూర్తి చేశారో చెప్పండి

` పాలమూరు అభివృద్ధిపై రేవంత్‌ సవాల్‌
` పాలమూరు బిడ్డల శ్రమతోనే ప్రాజెక్టులు
` ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేసిన కేసీఆర్‌
` బీఆర్‌ఎస్‌ పాలనలో ఉమ్మడి జిల్లాకు తీరని అన్యాయం
` పదేళ్లపాటు ప్రాజెక్టులు కట్టకుండా తీవ్ర నిర్లక్ష్యం
` పేదలకు పంచేందుకు భూమి లేదు..
` విద్యార్థులకు మంచి విద్య అందిస్తాం
` ఎంపీ డీకే అరుణ మద్దతుతో జిల్లాకు ఐఐఎం తీసుకొస్తాం
` మహబూబ్‌నగర్‌ బహిరంగ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి
` జిల్లాలో రూ.1,284 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
` జడ్చర్లలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌కు శంకుస్థాపన
మహబూబ్‌నగర్‌ బ్యూరో జనవరి 17(జనంసాక్షి):కష్టపడే తత్వం. నమ్మకం, విశ్వాసంగా పని చేసే పాలమూరు జిల్లా వెనుకబడడానికి కారణం ఆనాటి పాలకులు, గత ప్రభుత్వాలేనని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. పాలమూరు జిల్లాకు చేయాల్సిన న్యాయం చేయలేదని, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులు ప్రారంభించుకున్న ఈనాటికి అవి పూర్తి కాలేదన్నారు. శనివారం మహబూబ్‌ నగర్‌ పట్టణంలోని ఎం.వి.ఎస్‌. డిగ్రీ కళాశాల మైదానంలో మహబూబ్‌ నగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో త్రాగునీటి సరఫరా పథకంకు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థకు, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌, ఎంవీఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అదనపు నూతన భవన నిర్మాణాలు, నూతన నర్సింగ్‌ కళాశాల భవనం, , సమగ్ర అభివృద్ధికి పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంఖుస్థాపనలు చేశారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గిరిజన బాలుర వసతి గృహ భవన నిర్మాణం, గిరిజన బాలుర వసతి గృహ భవన నిర్మాణాలకు శంఖుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడే నిర్వహించిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు. ఆనాటి తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి ఒక్క కొత్త ప్రాజెక్టు అయినా పాలమూరు జిల్లాకు మంజూరు చేశారా అని ముఖ్యమంత్రి సవాల్‌ విసిరారు. ఈ జిల్లాలోని ప్రాజెక్టుల నిర్మాణంలో అర్ధాంతరంగా ఆగిపోయాయి అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు నారాయణపేట`కోడంగల్‌ ఎత్తిపోతల పథకం 2014 కంటె ముందే ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు అయ్యాయాని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులను పది సంవత్సరాలలో ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కాంట్రాక్టర్లకు 25 వేల కోట్ల రూపాయలు ఇచ్చారు తప్ప.. ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ భూసేకరణకు నష్టపరిహారంకు పైసలు ఇవ్వలేదు. సంగంబండలో 12 కోట్ల ఇచ్చి ఒక బండ పగులగొట్టేందుకు ముందుకు రాలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ బండ పగులగొట్టి పది వేల ఎకరాలకు, పది గ్రామాలకు నీరందించామన్నారు. కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో కృష్ణా నది జరాలు పారాలి.. మాడుగులకు నీళ్లు ఇచ్చేందుకు 75 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ కు భూసేకరణకు నిధులు మంజూరు చేసి పనుల పురోగతి తీసుకువచ్చామన్నారు. నారాయణపేట కోడంగల్‌ ఎత్తిపోతల పథకం ఆశా మాశిగా రాలేదని… దివంగత నేత చిట్టెం నర్సిరెడ్డి అడుగుతే ఏడున్నర టీఎంసీలతో ఆనాడు 2014 లో 15 వంద కోట్ల రూపాయలుతో ఉమ్మడి రాష్ట్రంలో చివరి జీవోగా ఎత్తిపోతల పథకం తెచ్చుకున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా నుంచి శాసనసభ్యులు, ఎంపీలు గెలిచినా ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాకా.. నారాయణపేట మక్తల్‌ కోడంగల్‌ ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేసి 96% భూమి పోయిన రైతులను ఒప్పించి, మెప్పించి నూటికి నూరు శాతం 100 రోజుల్లో నష్టపరిహారం ఇప్పించామన్నారు. ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేసి ప్రాజెక్ట్‌ కు అనుకూలంగా ఆమోదింప చేశామన్నారు. ఈ జిల్లా వాడిని కాబట్టే ఈ ప్రాంత సమస్యలు, రైతులు కష్టాలను అర్థం చేసుకొని జూరాల దగ్గర కొత్త బ్రిడ్జ్‌ నిర్మాణానికి 123 కోట్ల ను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆనాడు ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ ఒక్కరోజైనా కెసిఆర్‌ దగ్గరికి వెళ్లి ఈ ప్రాజెక్టులు పూర్తిచేయండని, పాలమూరుకు నిధులు ఇవ్వండని అడిగారా.. అడిగే ధైర్యం విూకున్నదా, కనీసం ఫామ్‌ హౌస్‌కు అయిన పోయారా అని ప్రశ్నించారు. ఇవాళ మేము వచ్చి పనులు చేస్తుంటే మమ్మల్ని తప్పులు పట్టే ప్రయత్నం చేయడమంటే చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ చెత్త ప్రచారాన్ని మా విూద చేయడానికి విూరు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ డీకే అరుణ మద్దతుతో మహబూబ్‌నగర్‌ జిల్లాకు ఐఐఎం తీసుకురావాలి జిల్లాలోనే ఏర్పాటు చేసుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్లి తెలంగాణకు నిధులు సాధించుకునేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు… ఉచితంగా ఏమిచ్చినా అది శాశ్వతం కాదు.. విద్య ఒక్కటే శాశ్వతం అదే ఇస్తామన్నారు. పండిత్‌ జవహార్‌ లాల్‌ నెహ్రూ స్ఫూర్తితో ఎడ్యుకేషన్‌, ఇరిగేషన్‌ మా మొదటి ప్రాధాన్యత అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా అభివృద్ధి చెందిన జిల్లాగా ఎడ్యుకేషన్‌ లోనూ ఇరిగేషన్‌లోనూ పాలమూరు జిల్లానే ముందు ఉండాలని ఆకాక్షించారు. ఎవరైనా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి చూసేందుకు వస్తే పాలమూరు జిల్లానే చూపించాలన్నారు. పాలమూరు జిల్లా వేనుకబాటుతనంను చూపించేందుకునే టోనిబ్లేయర్‌, బిల్‌గేట్స్‌లను తీసుకొచ్చేవాళ్లన్నారు. మన పేదరికం చూపించేందుకు మన వెనుకబాటుతనాన్ని చూపించి అయ్యా మేము అందరం వెనుక పడ్డాము, పాలమూరు వాసులు నిరక్షరాస్యతో కొట్టుమిట్టాడుతున్నారని, వలసలు పోతున్నారని. తినడానికి తిండి లేదని, కట్టుకోవడానికి బట్ట లేదని ఈ పేదరికం చూసి మాకు ఏమైనా బిక్షం ఉంటే ఇవ్వండని అడుక్కోవడానికి పాలమూరు జిల్లాను చూపించేవారని, అది ఎంత బాధాకరమైన విషయము ఒకసారి ఆలోచన చేయాలన్నారు. పాలమూరు పేదరికం చూపించి ప్రభుత్వం గ్రాంట్స్‌ అడిగేదన్నారు. ఇది ఏమాత్రం ఇక సహించ రానిదని.. ఇప్పుడు మన పేదరికం కాదు.. మన అభివృద్ధి చూపించాలి అన్నారు. పాలమూరు `రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఎస్‌ఎల్బీసీ పథకం, నారాయణపేట` కొడంగల్‌ ఎత్తిపోతల పథకాలు అన్నిటిని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. 2047 తెలంగాణ రైజింగ్‌ విజన్‌ తో ముందుకు సాగుతున్నాం అన్నారు. దశాబ్దాల క్రితం కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులే ఇప్పటికీ జీవనాధారం అయ్యాయన్నారు. గతంలో భూస్వాములు, దొరల వద్ద లక్షలాది ఎకరాలు ఉండేదదని, భూగరిష్ఠ పరిమితి చట్టం తెచ్చి మిగులు భూములను కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు పంచిందని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు పేదలకు పంచేందుకు ప్రభుత్వం వద్ద భూమి లేదని, ఇప్పుడు చేయగలిగింది మంచి విద్య అందించటమేనన్నారు. విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు. నిబద్ధత లేని చదువు వల్ల ప్రయోజనం ఉండదని, ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలని సూచించారు. 25 ఏళ్లు కష్టపడి చదివితే.. 75 ఏళ్ల వరకు గౌరవంగా జీవించవచ్చని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహా, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ డీకే అరుణ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

నేడు ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో సీఎం పర్యటన
` సీపీఐ శతవార్షికోత్సవ సభలో పాల్గొననున్న రేవంత్‌
` జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
` మేడారంలో వనదేవతల ఆలయాన్ని ప్రారంభించనున్న సీఎం
` అక్కడే కేబినేట్‌ భేటీకి ఏర్పట్లు పూర్తి
వరంగల్‌(జనంసాక్షి):ఖమ్మం వరంగల్‌ జిల్లాల్లో సిఎం రేవంత్‌ రెడ్డి నేడు పర్యటించనున్నారు. ఖమ్మంలో సిపిఐ వందో వార్షికోత్సవంలో పాల్గొననున్నారు. అలాగే పలు అభివృద్ది కార్యక్రమాలకు హాజరవుతారు. మద్దులపల్లిలో జెఎన్టీయూ కళాశాలకు శంకుస్థాపనతో పాటు, నర్సింగ్‌ కాలేజీని ప్రారంభిస్తారు. వ్యవసాయ మార్కెట్‌ ప్రారంభంతో పాటు మున్నేరు లింక్‌ కెనాల్‌ ప్రారంభిస్తారు. కూసుమంచిలో వందపడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేస్తారు. ఇకపోతే వరంగల్‌ పర్యటనలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుడతారు. మేడారంలో అమ్మవారి గద్దెలను ప్రారంభిస్తారు. అనంతరం మేడారంలో కేబినేట్‌ భేటీ ఉంటుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రులంతా అక్కడికి చేరుకుంటారు. మేడారంలో జరుగుతున్న సమ్మక్మ`సారలమ్మ జాతర ఏర్పాట్లను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇప్పటికే పరిశీలించారు. జాతర పనులు తుది దశకు చేరుకున్నాయని ఆమె వెల్లడిరచారు. ఆ తల్లుల దర్శనం కోసం అన్నివర్గాల ప్రజలు ఈ జాతరకు తరలివస్తారన్నారు. దాదాపు రెండు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని సీతక్క చెప్పారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖల సమన్వయంతో పని చేస్తున్నామని వివరించారు. మేడారం భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందన్నారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సీఎం రేవంత్‌ రెడ్డికి.. సమ్మక్క సారలమ్మ తల్లులతో ఎంతో భావోద్వేగ బంధం ఉందని గుర్తుచేశారు. అందుకే రూ.260 కోట్లతో మేడారం అభివృద్ధి పనులు చేపట్టారని చెప్పుకొచ్చారు. జనవరి 18న మేడారంలో దేవాలయాన్ని ప్రారంభించేందుకు సీఎం విచ్ఛేయనున్నారని తెలిపారు. ఇక్కడే కేబినెట్‌ సమావేశం సైతం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేబినేట్‌లో పలు కీలక అంశాలు చర్చించనున్నారు. అలాగే మున్సిపల్‌ ఎన్నికలపైనా చర్చిస్తారని సమాచారం. ఇకపోతే మేడారం వాట్సప్‌ చాట్‌ బాత్‌తోపాటు మొబైల్‌ యాప్‌నూ విడుదల చేశారు. వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌లో హెల్త్‌ క్యాంప్‌, టాయిలెట్‌ బాక్సులు, రూట్‌ మ్యాప్‌లు, ట్రాఫిక్‌ అప్‌డేట్‌లు, సహాయ కేంద్రాల ఫోన్‌ నంబర్లు, ఫిర్యాదుల నమోదుకు ప్రత్యేక వ్యవస్థ, నీటి సౌకర్యం తదితర అన్ని సౌకర్యాల సమాచారం కోసం వాట్సాప్‌ నంబర్‌ 7658912300 అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సీతక్క వివరించారు.