తెలంగాణ కోసం అఖిల పక్షం అవసరం లేదు
నిజామాబాద్, డిసెంబర్ 8 : తెలంగాణ కోసం అఖిల పక్షం అవసరం లేదని, పార్లమెంట్‌లో బిల్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ తన నిజాయితీని నిరూపించుకోవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. బిజెపి జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ప్రారంభమై మూడు సంవత్సరాలు అయినా నేటికీ కేంద్రం స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. 29నవంబర్ 2009న తెలంగాణ ఉద్యమం ఉధృతం అయినప్పుడు 9 డిసెంబర్ 2010 తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం తరపున అప్పటి హోంమంత్రి చిదంబరం ప్రకటించారని అన్నారు. సీమాంధ్ర నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం రాజీనామాలు చేయడంతో డిసెంబర్ 23న చిదంబరం తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకొని శ్రీకృష్ణ కమిటీని వేశారని గుర్తు చేశారు. కృష్ణ కమిటీ ఏడాది పాటు అభిప్రాయ సేకరణ చేసి తెలంగాణకు అనుకూలంగా నివేదికలు ఇవ్వలేకపోయారని అన్నారు.
కమిటీలతో అఖిల పక్షంతో తెలంగాణ రాదని, తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు రాజీనామాలు ఆమోదింపజేసుకొని ఉద్యమంలో పాల్గొంటేనే తెలంగాణ వస్తుందన్నారు. కాంగ్రెస్, టిడిపి, వైకాపాలు కుమ్మక్కై తెలంగాణను అడ్డుకుంటున్నారన్నారు. వెయ్యి మంది విద్యార్థులు చనిపోయినా ఆ పార్టీలకు పట్టదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్రకు తొత్తుగా వ్యవహరిస్తూ కేంద్రానికి తెలంగాణపై తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆరోపించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణకు అనుకూలమేనని తెలంగాణ జిల్లాలో తిరుగుతున్నారే తప్ప స్పష్టమైన వైఖరి ప్రకటించడంలేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పార్లమెంట్‌లో శీతాకాల సమావేశంలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని, డిసెంబరు 9న తెలంగాణ ప్రక్రియను వెనక్కి తీసుకున్నందున, అదే రోజు నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ సమావేశంలో బిజెపి నగర అధ్యక్షుడు డా.బాపురెడ్డి, మల్లేష్‌యాదవ్, బాల్‌కిషన్ తదితరులు పాల్గొన్నారు.