తెలంగాణ కోసం మరో ఆత్మబలిదానం
సిరిసిల్ల మండలం జిల్లెల్లలో విషాదం
సిరిసిల్ల, అక్టోబర్ 3 (జనంసాక్షి) :
తెలంగాణ మార్చ్‌ను ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నించిన పద్ధతి మరో తెలంగాణ బిడ్డ కలత చెందేలా చేసింది. ఇదంతా గమనించిన ఆ యువకుడు ఇక తెలంగాణ రాదేమోనన్న బెంగతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీమాంధ్ర నాయకులు, కేంద్ర పాలకుల వ్యాఖ్యలే తమ కొడుకును బలి తీసుకున్నాయని ఆ అమరుడి తల్లిదండ్రులు శాపనార్థాలు పెడుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలంలోని జిల్లెల్ల గ్రామానికి కలికోట సదానందరెడ్డి (28) ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టి ఇటీవలే స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. తెలంగాణ మార్చ్‌లో పోలీసులు ఉద్యమకారులపై చేసిన దాడితో అతడు తీవ్రంగా ఆవేదన చెందాడు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితుల ముందు చర్చిం చాడు. ప్రభుత్వ వైఖరితో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇదే క్రమంలో తెలంగాణ రాదేమోనన్న నిస్పృహతో వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నాడు స్వాతంత్య్ర పోరాట కోసం ఉద్యమించిన వారిపై బ్రిటీష్ వాళ్లు ఉన్నాదుల్లా దాడి చేసినట్లు ప్రభుత్వం తెలంగాణవాదులపై దాడులకు దిగుతున్నదని ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. తెలంగాణకు అడ్డు తగులుతున్న సీమాంధ్రుల తీరు, కేంద్రం చేస్తున్న జాప్యంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో వివరించాడు. సంఘటనా స్థలాన్ని టీఆర్‌ఎస్ నాయకులు సందర్శించి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.