” తెలంగాణ గడ్డపై కాషాయపు జెండా రెపరెపలు తథ్యం – స్పష్టం చేసిన బిజెపి నేతలు బొబ్బ నవతారెడ్డి మొవ్వ సత్యనారాయణ

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 27( జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో గులాబీ దండు గుండెలు బాదుకున్నా… ప్రజలకు సాగిలపడి మొక్కినా నాయకులను కనికరించే పరిస్థితి లేదని, ఏది ఏమైనా తెలంగాణ గడ్డపై కాషాయపు జెండా రెపరెపలు తత్యమని బిజెపి నేతలు బొబ్బ నవతారెడ్డి, మొవ్వ సత్యనారాయణలు స్పష్టం చేశారు. ఈమేరకు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మూడవ విడత ముగింపును పురస్కరించుకొని శనివారం వరంగల్ కు తరలివెళ్లి ఆయనకు  సంఘీభావం ప్రకటించారు. ఇందులో భాగంగా వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి అధికారం దక్కేలా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం శేర్లింగంపల్లిలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ తెరాస నాయకులు అభివృద్ధి పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా విధ్వంసం చేసారో ప్రతి ఒక్క తెలంగాణబిడ్డ స్పష్టంగా గమనిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో ఇక గులాబీ దండు ఆటలు సాగే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కెసిఆర్ కంపెనీ గురించి చర్చోప చర్చలు సాగుతున్నాయని, కనీసం డిపాజిట్ దక్కే పరిస్థితికూడా చాలాచోట్ల ఉండదని వారు ఆశాభావం వ్యక్తంచేశారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను 4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిన బుట్టాచోర్ కెసిఆర్ ను గద్దెదించడం ప్రస్తుతం ప్రజల ముందున్న మొదటి లక్షమైతే గద్దె దిగిన మరుక్షణం అణా పైసతోసహా దోచుకున్న పైసనంతా కెసిఆర్ కుటుంబం కక్కేవరకు బిజెపి సర్కారు వదిలిపెట్టబోదని వారు జోస్యం చెప్పారు. ప్రస్తుతం గులాబీ దొంగలను చూస్తే గుడ్లురుముతున్నారని, త్వరలోనే రాష్ట్రం పొలిమేరలు దాటే అంతవరకు తరిమి తరిమి రాజకీయ సమాధి చేయడం ఖాయమని వారు ధీమాను వ్యక్తంచేశారు. ప్రతి భారతీయ జనతాపార్టీ కార్యకర్త కార్గిల్ సైనికులై ఎన్నికల కథనరంగాన దూకి శేర్లింగంపల్లి నియోజకవర్గంలోపాటు యావత్ తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని ఓట్లతో ఆశీర్వదించి అధికార పీఠం అందుకునేంతవరకు విశ్రమించకూడదని, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధి కోసం, సార్వభౌమత్వం కోసం భారతీయ జనతా పార్టీని ప్రజలు గుండెలకు హత్తుకోవాల్సిన సందర్భం వచ్చిందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ జానకిరామరాజు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.