తెలంగాణ జైళ్ల అధ్యయనానికి పంజాబ్ అధికారులు
హైదరాబాద్,డిసెంబరు 17 (జనంసాక్షి): పంజాబ్ జైళ్లశాఖ మంత్రి ఎస్‌హెచ్. సుక్జిందర్ ఎస్ రంధ్వా నేతృత్వంలోని అధికారుల బృందం తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ స్థితిగతుల అధ్యయనానికి విచ్చేసింది. రాష్ట్ర జైళ్లశాఖ అధికారులతో కలిసి గురువారం చెర్లపల్లి కేంద్ర కారాగారాన్ని, ఓపెన్ ఎయిర్ జైలును పరిశీలించారు. శుక్రవారం నాడు రాష్ట్రంలోని మరికొన్ని జైళ్లను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా చార్మినార్ మెమెంటోను పంజాబ్ మంత్రికి ¬ంమంత్రి మహమూద్ అలీ బహూకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఖైదీలు చదువుకునేందుకు అన్ని సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు. వారు పనిచేసేందుకు పరిశ్రమల యూనిట్స్ ఏర్పాటు చేశామన్నారు. శిక్షాకాలం పూర్తి చేసుకున్న ఖైదీలకు జైళ్లశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోల్ బంకుల్లో ఉపాధి కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది, ఐజీ సైదయ్య, పంజాబ్ ప్రిజన్స్ ఏడీజీపీ ప్రవీణ్ కె సింహా, ఎస్‌పీఎస్ ఒబెరాయ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.