తెలంగాణ ద్రోహులతో..  కాంగ్రెస్‌ పొత్తుపెట్టుకుంది


– కూటమి కుట్రలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలి
– అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచింది కేసీఆరే
– నాలుగేళ్లలో కులవృత్తులకు పెద్దపీట వేశాం
– మరోసారి ఆశీర్వదించి అభివృద్ధికి ఊతమివ్వండి
– ఆపద్ధర్మ మంత్రి శ్రీనివాస్‌రెడ్డి
కామారెడ్డి, అక్టోబర్‌29(జ‌నంసాక్షి) : తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణకు అడ్డుపడి, తెలంగాణ వచ్చిన తరువాత మన ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న తెలంగాణ ద్రోహులతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుందని ఆపద్ధరమ్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌ విమర్శించారు. సోమవారం బాన్సువాడలోని నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని బోయ, మోచి సంఘాల నాయకులు, సభ్యులు తమ కుటుంబాలతో సహా కలిశారు. అనంతరం తమ పూర్తి మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఈసందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ వద్దన్న పార్టీలతో కాంగ్రెస్‌ జతకట్టిందని విమర్శించారు. ఆంధ్రాపోయిన చంద్రబాబు నాయుడ్ని మళ్లీ పల్లకిలో మోసుకుంటూ తెలంగాణకు తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కూటమిపేరుతో వస్తున్న పార్టీల అభ్యర్ధులకు ఓట్లతో బుద్దిచెప్పాలని శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. నాలుగేళ్ల కాలంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. గతంలో కాంగ్రెస్‌, టీడీపీలు చేయని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను నాలుగేళ్లలో అందించామని అన్నారు. తెరాసకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలుస్వచ్చధంగా మద్దతు తెలుపుతున్నారని అన్నారు. భయపెడితేనో, బెదిరిస్తేనో వచ్చిన మద్దతు కాదని, స్వచ్ఛందంగా, ప్రేమతో వస్తున్న మద్దతు అని మంత్రి తెలిపారు. పనిచేసే పార్టీలకు, నాయకులకు కుల సంఘాల వారు మద్దతు తెలుపుతున్నారన్నారు. స్వచ్ఛందంగా మద్దతు తెలిపిన అందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కుల
వృత్తుల ప్రోత్సాహానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అధిక నిధులను కేటాయిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌ లో ఎస్సీల అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.15,000 కోట్లు కేటాయించామని పోచారం తెలిపారు. భవిష్యత్తులో మరింతగా నిధులను అందించి వారి అభివృద్ధికి తోడ్పడుతామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బోయల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రోత్సహించిందని తెలిపారు. 100 శాతం సబ్సిడీతో చేప విత్తనాల సరఫరా, 75శాతం సబ్సిడీతో వాహనాలు అందజేత, చేపల విక్రయానికి నూతనంగా మార్కెట్ల నిర్మాణం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే జరిగిందని ఆపద్ధర్మ మంత్రి తెలిపారు. ఈసందర్భంగా మద్దతుతో కూడిన తీర్మానాన్ని సంఘాల నాయకులు మంత్రికి అందజేశారు