తెలంగాణ నోట్లో మట్టి కొడతారు
సిద్దిపేట,అక్టోబర్30(జనంసాక్షి): తెలంగాణ రైతాంగం నోట్లో మళ్లీ మట్టి కొట్టేందుకు మహాకూటమి రూపంలో కాంగ్రెస్,టిడిపి నేతలు వస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతుల కష్టాలు తీరాయన్నారు. గజ్వెల్‌లో యాదవ సమ్మేళనంలో పాల్గొనేందుకు వచ్చిన తలసాని తనను కలసిని విూడియా మిత్రులతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ నాయకులు ఏనాడూ పని చేయలేదని మంత్రి మండిపడ్డారు.తెలంగాణ కాంగ్రెస్ నేతల నిర్వాకం వల్లే తెలంగాణ నష్టపోయిం దన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంటే.. కాంగ్రెస్ నేతలు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. ఈ ప్రాంతాన్ని మరో కోనసీమగా తయారు చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు విూద 200 కేసులు వేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంటింటికీ తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తే తమ కిందికి నీళ్లు వస్తాయని భావించి.. కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేశారన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోతలు అందరికీ తెలుసు. 2009లో తొమ్మిది గంటల కరెంట్ ఇస్తామని చెప్పారు. కానీ ఆరు గంటల కరెంట్ ఇచ్చారు. ఇది కూడా ఒకేసారి ఇవ్వలేదు. కరెంట్ కోసం ఆనాడు నానాతిప్పలు పడ్డారు. ధర్నాలు చేసే పరిస్థితి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. రైతుబంధు పథకం అమలు చేశాం. రైతుబీమాతో వారి కుటుంబాల్లో భరోసా నింపామని స్పష్టం చేశారు.