తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటాం: కేటీఆర్
హైదరాబాద్: ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తెరాసకు ప్రజలు చిరస్మరణీయమైన విజయం కట్టబెట్టారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. అలాగే వచ్చే ఆర్నెల్లలో రాష్ట్రంలో జరగబోయే వివిధ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత తనపై ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘‘ఇటీవల ఎన్నికల్లో తెరాసకు చిరస్మరణీయ విజయం లభించింది. అన్ని రాజకీయ పక్షాలు ఒకవైపు, కేసీఆర్ ఒకవైపు నిలబడితే ప్రజల తీర్పు కేసీఆర్ పక్షాన నిలవడం ఆనందంగా ఉంది. అందుకు ప్రజలకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నా. 2 కోట్ల మంది ఓటింగ్ పాల్గొంటే 98 లక్షల ఓట్లు తెరాసకు వచ్చాయి. ఆ తర్వాతి స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌కు, మా పార్టీకి మధ్య 45 లక్షల ఓట్ల వ్యత్యాసం ఉంది. మరో జాతీయ పార్టీగా చెప్పుకునే భాజపాకు 103 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయి. 100 స్థానాల్లో డిపాజిట్లు పోతాయని ఎన్నికలకు ముందే చెప్పా. ఆ పార్టీ తరఫున మోదీ, అమిత్‌షా ప్రచారం చేసినా ఉపయోగం లేదు. కేసీఆర్‌పై ఉన్న నమ్మకంతోనే ప్రజలు తెరాసకు విజయాన్ని కట్టబెట్టారు. దాదాపు 75 శాతం సీట్లు అందించారు.
మాకు ఇంతటి విజయం అందించిన ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. పార్టీ, ప్రభుత్వ నిర్వహణలో, జాతీయ స్థాయిలో తెరాస ప్రభావంతమైన పాత్ర పోషించాలన్న ఉద్దేశంతో నాకు కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 4 ఎన్నికలు చూశా. ఈ అనుభవం బట్టి క్షేత్రస్థాయిలో ఇంకా తెరాస బలోపేతం కావాల్సి ఉంది. 100 ఏళ్ల పాటు పటిష్ఠమైన పార్టీగా రూపొందించాల్సిన అవసరం ఉంది. ఓవైపు హామీలను నెరవేరుస్తూనే.. త్వరలో జరగబోయే పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కొంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది. పార్టీని సమర్థంగా ముందుకు తీసుకెళ్లడమే నాముందున్న లక్ష్యం.
2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గానీ, భాజపా గానీ స్వతహాగా గెలుపొందే అవకాశం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 17 లోక్‌సభ స్థానాల్లో 16 చోట్ల తెరాస గెలుస్తుంది. దేశ ప్రధానిని నిర్ణయించే నిర్ణయాత్మక శక్తి తెలంగాణకు వస్తుంది. తెలంగాణలో అమలౌతున్న పథకాలు దేశవ్యాప్తంగా రావాలంటే తెరాస జాతీయ రాజకీయాల్లోకి క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది’’ అని కేటీఆర్ అన్నారు.