తెలంగాణ ప్ర‘జల’ విజయం
ఇది కేసీఆర్, బీఆర్‌ఎస్ ఉద్యమ ఫలితం
కృష్ణా జలాల పరిష్కారంపై మంత్రి హరీశ్ రావు
పాలమూరు జిల్లా మరో కోనసీమ కాబోతుంది
మళ్లీ ఆశీర్వదిస్తే మరేన్నో అభివృద్ధి ఫలాలు : హరీశ్‌రావు
కృష్ణా జలాల్లో నీటి పంపిణీ నిర్ణయం తెలంగాణ ప్రజల విజయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ ఉద్యమ ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు పరిష్కార మార్గాలను ప్రారంభించిందని తెలిపారు. గడిచిన తొమ్మిదేళ్లుగా కృష్ణ ట్రిబ్యునల్ ఏర్పాటుచేసి కృష్ణ నది నికర జలాల వాటా పంచాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయగా ఎట్టకేలకు కేంద్ర కేబినేట్ ద్వారా కృష్ణ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. ఇప్పటికే కృష్ణా నదిపై ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నామని ఇక పాలమూరు రంగారెడ్డికి నికర జలాలు వస్తాయని అప్పుడు ఉమ్మడి పాలమూరులోని ప్రతి గుంట భూమికి సాగునీరు వచ్చి మరో కోనసీమగా మారబోతుందన్నారు. సంవత్సరం లోపల పాలమూరు రంగారెడ్డికి కెనాల్ ఏర్పాటు చేసి ప్రతి గుంటకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
వనపర్తి బ్యూరో/నారాయణపేట బ్యూరో, అక్టోబర్04 (జనంసాక్షి)
బుధవారం పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా ఉదయం కొస్గి, మక్తల్ పర్యటించి సాయంత్రం వనపర్తి జిల్లా కొత్తకోటలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపన చేశారు. మధనపూర్‌లో 136 డబుల్ బెడ్ రూం ఇళ్లను దేవరకద్ర శాసన సభ్యులు ఆల వేంకటేశ్వర రెడ్డి తో కలిసి ప్రారంభోత్సవం చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్ళ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రికి మహిళలు బతుకమ్మలతో ఘన స్వాగతం పలుకగా ప్రజలు డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో స్వాగతం పలుకగా మంత్రి హరీష్ రావు నర్సింహ, అనంతమ్మ దంపతుల ఇంటికి రిబ్బన్ కత్తిరించి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం కొత్తకోటలో దేవరకద్ర కు సంబంధించిన 100 పడకల ఆసుపత్రి, కొత్తకోట లో 30 పడకల ఆసుపత్రి, కొత్తకోట మున్సిపాలిటీలో 12 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు. అనంతరం బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. పాలమూరు రంగారెడ్డి కెనాల్ పూర్తి అయితే మరో 60 వేల ఎకరాలకు సాగునీరు వస్తుందన్నారు. తన నియోజకవర్గానికి అడిగినన్ని నిధులు మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి, మంత్రి హరీష్ రావుకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా స్పోర్ట్స్ కిట్, లబ్దిదారులు కు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 : మంత్రి హరీశ్‌రావు
సంక్షేమ పథకాలు అమలు చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరసలో నిలబెట్టామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మక్తల్‌లో రూ.34 కోట్లతో 150 పడకల ఆసుపత్రి, అగ్నిమాపక కేంద్రం ప్రారంభం, రూ 156 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రూ.72 లక్షలతో మార్కెట్ కమిటీ కార్యాలయం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను శంకుస్థాపన, ప్రారంభించి హరీష్ రావు మక్తల్ లోని పంపు హౌస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. మక్తల్‌ను ఆకుపచ్చ మక్తలుగా మార్చినట్లు తెలిపారు. ఆనాడు త్రాగడానికే నీరు లేని పరిస్థితి కాగా నేడు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేసినట్లు తెలిపారు. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మక్తల్ ఎలా అభివృద్ధి చెందింది వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావు కేటీఆర్ ఆధ్వర్యంలో మక్తల్ నియోజకవర్గ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్న అని తెలిపారు. మక్తల్‌కి 3మున్సిపాలిటీ వచ్చినవి ప్రతి గడప గడపకు పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో నారాయణపేట జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అనంతరం బీసీ బందు క్రింద రూ లక్ష చెక్కులను, దళిత బంధు, మైనారిటీలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రికి గొల్ల కురుమలు గొర్రె పిల్లను కానుకగా అందజేశారు. ఈ కార్యక్రమంలో చిట్టెం సుచరిత రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, గిడ్డంగుల చైర్మన్ రజనీ సాయిచంద్, జడ్పీ చైర్మన్ వనజ ఆంజనేయులు, నిజాం పాషా, శ్రీనివాస గుప్తా,శ్రీధర్ గౌడ్, జెడ్పిటిసిలు ఎంపీపీలు అధికారులు,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.