తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌(జ‌నం సాక్షి): రైతుబంధు పథకంపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రైతుబంధు పథకం అందరికీ అమలు చేయడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని.. అందువల్ల దీన్ని పేద, చిన్న రైతులకే పరిమితం చేయాలని కోరుతూ అందిన లేఖను ఉన్నత న్యాయస్థానం ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా విచారణకు స్వీకరించింది. రైతుబంధు పథకంలోని లోటుపాట్లను వివరిస్తూ నల్గొండకు చెందిన న్యాయవాది యాదగిరిరెడ్డి ఉన్నత న్యాయస్థానికి లేఖ రాశారు. ఎన్నారైలు, ప్రభుత్వోద్యోగులు, ఆదాయపన్ను చెల్లింపుదారులను పథకం లబ్ధి నుంచి తొలగించాలని సూచించారు. లేఖను పిల్‌గా స్వీకరించిన హైకోర్టు దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.