‘తెలంగాణ’ బానిస సంకెళ్లు తెంచేందుకు
ఉద్యోగ కార్మికులు పోరాడాలి
శ్రీసెప్టెంబర్ మార్చ్‌కు టీఎన్‌జీవోలు కదిలిరావాలి
శ్రీటీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్
హైదరాబాద్, ఆగస్టు 25 (జనంసాక్షి) : సెప్టెంబర్ 30న భారీగా కదిలి వచ్చి ఆ రోజు తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరుగనున్న తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేసి ఉద్యమ భాగస్వాములు కావాలని టీఎన్‌జీవోస్ అధ్యక్షుడు దేవీప్రసాద్ వైద్యారోగ్య శాఖ ఉద్యోగులను కోరారు. శనివారం ఆ శాఖ ఉద్యోగుల సర్వ సభ్యసమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా దేవీప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మూడేళ్లుగా ఉద్యమం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు స్టేట్ యూనియన్‌ను వ్యతిరేకించి ఉద్యమం వైపు రావడం అభినందనీయమని కొనియాడారు. వైద్యారోగ్య శాఖ ఉద్యోగులను 12 ఏళ్లుగా రెగ్యులరైజ్ చేయకుండా ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, లేకుంటే ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించి, ఉద్యోగులతో కలిసి ఉద్యమిస్తామని దేవీప్రసాద్ హెచ్చరించారు. ఎల్లప్పుడు ప్రజల పక్షాన నిలబడే మార్క్సిస్టులు తెలంగాణ ఉద్యమంలో కలిసిరాక పోవడం విచారకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీపీఎం కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ, ప్రజలతో కలిసిరావాలని దేవీప్రసాద్ కోరారు.