తెలంగాణ మార్చ్‌కు టీఆర్ఎస్ సై
సెప్టెంబర్ మార్చ్ ఓ యుద్ధమే : హరీశ్
హైదరాబాద్, సెప్టెంబర్ 17(జనంసాక్షి):
సెప్టెంబర్ 30న తెలంగాణ పొలిటికల్ జేఏసీ తలపెట్టిన ‘తెల ంగాణ మార్చ్’కు ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ దూరంగా ఉంటుందా? అన్న ఉత్కంఠ వీడిపోయింది. జేఏసీతో విభేదాల నేపథ్యంలో.. తెలంగాణ మార్చ్‌లో పాల్గొం టుందా? అన్న సందేహాలకు ఆ పార్టీ తెర దించింది. జేఏసీ తలపెట్టిన మార్చ్‌లో పాల్గొనున్నట్లు స్పష్టంచేసింది. తెలంగాణ మార్చ్‌లో టీఆర్ఎస్ యుద్ధబేరి మోగిస్తుందని ఆపార్టీ ఎమ్మెల్యే హరీశ్‌రావు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేసి తెలంగాణ సత్తాచూపిస్తామన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా, మరెన్ని ఆటంకాలు కల్పించినా మార్చ్‌ను విజయవంతం చేస్తామన్నారు. సోమవారం ఉదయం అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ఆయన విూడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌చేశారు. ఇక్కడ తీర్మానం తీస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుం దన్నారు. తద్వారా సత్వరమే నిర్ణయం తీసుకునే వీలుంటుందని చెప్పారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపక పోవడంపై ఆయన మండిపడ్డారు. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ పరంగా గాంధీభవన్‌లో తెలంగాణ విమోచన దినాన్ని జరుపుకోవడం, ప్రభుత్వపరంగా అసెంబ్లీలో జరపకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ విమోచన దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో జాతీయ జెండాను ఎగురవేస్తారని, అదే క్యాబినెట్ మంత్రిగా ఉన్న బొత్స అసెంబ్లీలో ఎలాంటి కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించరని మండిపడ్డారు. కాంగ్రెస్ తెలంగాణప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తోందన్నారు. విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, మరెన్ని అరెస్టులు చేసినా ఉద్యమం ఆగదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. తమపై కేసులు పెడితే ఏమవుతుందోవారే చూస్తారని, అయినా కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. కేసులు పెట్టడం తప్ప ఈ ప్రభుత్వానికి ఇంకేం చేతగాదన్నారు. తెలంగాణ వాసుల కల అయిన ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకూ వెనుకడుగు వేసేది లేదన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఇక సమరం తప్పదని స్పష్టం చేశారు. తెలంగాణ మార్చ్‌లో టీఆర్ఎస్ పాల్గొంటుందని వెల్లడించారు. మార్చ్‌లో తమ పార్టీ యుద్ధ భేరి మోగిస్తుందన్నారు. తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా కోతలు విధిస్తున్నారని, సీమాంధ్ర ప్రాంతంలో తక్కువగా కోతలు విధిస్తూ పక్షపాతం చూపుతున్నారని విమర్శించారు. తెలంగాణ రైతులకు మూడు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే మళ్లీ విద్యుత్ సౌధను ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరామన్నారు. తెలంగాణపై తీర్మానం పెట్టడం సాధ్యం కాదన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలను హరీశ్‌రావు ఖండించారు. తెలంగాణ తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టాల్సిందేనని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణ అంశం రాష్ట్ర పరిధిలో లేదన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అవాస్తవమన్నారు. ఇక్కడ తీర్మానం ఆమోదిస్తే.. కేంద్రంపై ఒత్తిడి పెరిగే, సత్వరమే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.