తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూల వాతవరణం

ఢిల్లీ, డిసెంబర్‌ 28 (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూల వాతవరణం ఏర్పడిందని, తెలంగాణను ఆపడం ఇక ఎవరి తరం కాదని ఆ ప్రాంత ఎంపీలు వ్యాఖ్యానించారు. అఖిలపక్ష సమావేశం అందరూ అనుకున్న దానికి భిన్నంగా జరిగిందని

పేర్కొన్నారు. రెండు రాష్టాల్రే కాంగ్రెస్‌ విధానమని ¬ం మంత్రి షిండే చెప్పడం సంతోషకరమని, కాంగ్రెస్‌ పార్టీ స్పష్టతనిచ్చిందనడానికి ఇదే నిదర్శమని తెలిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు బద్ద వ్యతిరేకి అని తెలంగాణ ప్రాంత ఎంపీలు విమర్శించారు. అస్పష్టమైన ప్రకటనతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అసలు రంగు బయటపడిందని మండిపడ్డారు. శుక్రవారం టీ-ఎంపీలు ఢిల్లీలో విూడియాతో మాట్లాడారు. 2008లో ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన నాటి లేఖకు కట్టుబడి ఉంటామన్న తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని వారు స్వాగతించారు. చంద్రబాబు అదే మాటకు కట్టుబడి ఉంటే.. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.  నెల రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వం హావిూ ఇచ్చిన నేపథ్యంలో.. బంద్‌ పిలుపును విరమించుకోవాలని టీఆర్‌ఎస్‌కు విజ్ఞప్తి చేశారు. నెల రోజులు ఓపిక పట్టాలని, బంద్‌పై పునరాలోచించాలని సూచించారు. నెల రోజుల గడువులో అన్ని పార్టీలు కలిసికట్టుగా మాట్లాడుకుందామని ప్రతిపాదించారు. నిర్మాణాత్మక పద్ధతిలో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్ర ¬ం మంత్రి షిండేకు వారు ధన్యవాదాలు తెలిపారు. రెండు రాష్టాల్రకు అనుకూలమని షిండే సమావేశంలో స్పష్టంగా చెప్పారని వారన్నారు. తెలంగాణ సాధనకు భవిష్యత్తులో కూడా అధిష్టానంపై ఒత్తిడి తెస్తామని తేల్చి చెప్పారు. తెలంగాణపై నెల రోజుల్లోపే నిర్ణయం వస్తుందని తాము భావిస్తున్నట్లు ఎంపీ మందా జగన్నాథం తెలిపారు.  2009 డిసెంబర్‌ 9వ తేదీనే కాంగ్రెస్‌, కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ప్రకటించాయని, అయితే, ఇతర పక్షాలు వెనక్కుపపోవడంతో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగిపోయిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందనడానికి ఈ సమావేశమే నిదర్శనమన్నారు. షిండే ప్రకటనను, టీడీపీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. టీడీపీ వైఖరిని ఎంపీ మధుయాష్కీ కూడా స్వాగతించారు. 2008 నాటి లేఖకు కట్టుబడి ఉన్నామని చెప్పడం హర్షణీయమన్నారు. చంద్రబాబు ఆ మాటకు కట్టుబడి ఉండాలని, మరోసారి మాట మార్చకూడదన్నారు. తెర వెనక చిరంజీవి లాంటి వారితో మాట్లాడుకొని మాట మారిస్తే.. బాబు తెలంగాణలో కూడా మిగలకుండా పోతాడని హెచ్చరించారు. అఖిలపక్ష సమావేశంలో అనుసరించిన వైఖరితో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యతిరేకి అని తేలిపోయిందన్నారు. నాడు జగన్‌ పార్లమెంట్‌లో సమైక్య ప్లకార్డు ప్రదర్శించారని, నేడు ఆయన పార్టీ స్పష్టమైన వైఖరి చెప్పకుండా తెలంగాణ ప్రజలను మోసగించిందన్నారు. ఆ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మవద్దని సూచించారు. వైఎస్సార్‌ సీపీ జెండా పట్టుకున్న వారంతా తెలంగాణ ద్రోహులేనని విమర్శించారు. వైఎస్సార్‌ సీపీలో ఉన్న తెలంగాణ ప్రాంత నేతలంతా బయటకు రావాలని కోరారు. పాదయాత్ర పేరుతో తెలంగాణపై దండ్రయాత్ర చేస్తున్న వారిని అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణను ఏర్పాటు అనివార్యమని, ఇక ఎవరూ ఆపలేరని ఎంపీ వివేక్‌ అన్నారు. ఎవరెంత వ్యతిరేకించినా తెలంగాణ ఏర్పాటు ఆగదన్నారు. బంద్‌ నిర్ణయంపై కేసీఆర్‌ మరోసారి ఆలోచించాలని టీ-ఎంపీలు విజ్ఞప్తి  చేశారు. తెలంగాణపై అఖిలపక్ష ఏర్పాటు చేసి స్పష్టత తీసుకువచ్చినందుకు గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు చేస్తారనే నమ్మకం తమకు కలిగిందని పొన్నం ప్రభాకర్‌ అన్నారు. జగన్‌ తెలంగాణ ద్రోహి అని.. తాను తెలంగాణ వ్యతిరేకినని ఆయన మరోసారి నిరూపించుకున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌ సీపీలో ప్రజాస్వామ్యం లేదని, నియంతృత్వం ఉందని విమర్శించారు. కేసీఆర్‌ బంద్‌ పిలుపును ఉపసంహరించుకోవాలని పొన్నం కోరారు.