తెలంగాణ సాయుధపోరాట నిప్పురవ్వ **

*చాకలి ఐలమ్మ**
*సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి*
కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 10(జనం సాక్షి)

భూమికోసం,భుక్తి కోసం,విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన దీర వనిత చాకలి ఐలమ్మ అని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిప్పు రవ్వల వెలుగి ఎన్నో మహిళా ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిందని సిపిఎం జిల్లా కార్యదర్శి మీలుకూరి వాసుదేవరెడ్డి అన్నారు.
చిట్యాల ఐలమ్మ 37వ వర్ధంతి సందర్భం గా సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముకుంద లాల్ మిశ్రా భవన్లో శనివారం చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ నైజాం తొత్తు, మధ్య యుగాల భూస్వామ్య వ్యవస్థ ప్రతినిధి, నరరూప రాక్షసుడైన విసునూరు దేశ్‌ముఖ్‌ను ఎదిరించిన మట్టి మనిషి చాకలి ఐలమ్మఅని’నీ కాళ్ళు మొక్కుత దొరా! నీ బాంచెన్‌ దొరా!’ అన్న తెలంగాణ రైతు కూలీ బిడ్డలు, ఆ దొరలకు వ్యతిరేకంగా గుతపలు, వడిసెల, తుపాకులతో తిరగబడ్డారన్నారు. ఆ మహత్తర తిరుగుబాటుకు స్ఫూర్తి, సంకేతం. ఆంధ్ర మహాసభ నాయకత్వంలో ఎర్రజెండా పట్టింది. పోరాడింది. పంటను, భూమిని దక్కించుకుంది. దొరలనెదిరిస్తే కష్టాలు తప్పవని, ప్రాణాలు తీస్తారని ఆమెకు తెలుసు. అయినా, లొంగి బతకడం కన్నా, పోరాడి మరణించటమే మేలనుకుంది.

ఐలమ్మకు స్వంత భూమి లేదు. మల్లంపల్లి భూస్వామి కొండల్‌రావు దగ్గర నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుంది. కుల వృత్తిమీద వచ్చే మాన్యం గింజలతో పాటు, కౌలు వ్యవసాయం మీద వచ్చే ఆదాయం ఐలమ్మ కుటుంబానికి ఆసరాగా ఉండేది. సంఘం నాయకులు చెప్పే విషయాలన్నీ ఐలమ్మ జాగ్రత్తగా వినేది. గ్రామంలో జరుగుతున్న విషయాలన్నీ అర్థం చేసుకునేది. పాలకుర్తిలో సంఘం కార్యక్రమాలకు ఐలమ్మ ఇల్లే కేంద్రమైంది.

”ఈ భూమి నాది… పండించిన పంట నాది… తీసుకెళ్ళడానికి దొరెవ్వడు?… నా ప్రాణం పోయాకే యీ పంట, భూమి దక్కించుకోండి” అంటూ ఐలమ్మ మాటలను తూటాలుగా పేల్చింది. సంఘం నాయకులు పండించిన ధాన్యాన్ని, మోపులు కట్టి, కొట్టి ఐలమ్మ ఇంటికి చేర్చారు.
సంఘం నాయకులు భీమిరెడ్డి నర్సింహారెడ్డి తదితరులను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారు.యీ పోరాటాలు విస్తృతమయ్యాయి. అజ్ఞాతంలో ఉన్న నాయకులకు అన్నం పెట్టేందుకు ఐలమ్మ పడరాని పాట్లు పడ్డది. గంపల్లో తీసుకెళితే పోలీసులు పట్టుకుంటారని చాకలి బట్టల మూటల్లో అన్నం తీసుకెళ్ళి కమ్యూనిస్టు దళాలకు పెట్టింది. సాహసం, ధైర్యం ఐలమ్మ ఊపిరి.

ఐలమ్మ భూమి కోసం, నమ్మిన ఆశయం కోసం ఆంధ్ర మహాసభ నాయకత్వంలో పోరాడింది. ఎన్ని కష్టాలు వచ్చినా చలించలేదు. ఎర్ర జెండాను ఎత్తుకున్నది. 1985 సెప్టెంబర్‌ 10న పాలకుర్తిలో తన మనుమరాలి ఇంట్లో మరణించింది. ఆ విప్లవమూర్తి, పోరు తల్లికి విప్లవ జోహార్లు.వారి ఆశయాలను కొనసాగిస్తాం.. ఈ కార్యక్రమంలో ఎం పూజ పున్నం రవి లక్ష్మి రోహిత్ అరవింద్ సురేష్ అశోక్ రమ్య తదితరులు పాల్గొన్నారు