తెలుగింటి ఆడపడుచును ఆదరించండి

– బీజేపీ అభ్యర్థి బల్మూరి వనిత
గోదావరిఖని, నవంబర్ 25, (జనంసాక్షి) :
రామగుండం నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా తనను ఆదరించాలని బల్మూరి వనిత అన్నారు. ఈ మేరకు కార్పొరేషన్‌లోని పలు డివిజన్లలో ఆమె ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తెలుగింటి ఆడపడుచునైన తనను నియోజకవర్గ ప్రజలు ఆదరించి గెలిపించాలని ఆమె కోరారు. ఇప్పటి వరకు రామగుండం నియోజకవర్గం నుంచి మహిళ ఎమ్మెల్యేగా ఎవరూ లేరని, ఈసారి తనను గెలిపిస్తే రామగుండాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి అనుకున్నంత స్థాయిలో జరుగలేదని వనిత తెలిపారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం కల్పిస్తే అభివృద్ది చేసి చూపిస్తానని వనిత పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అమరేందర్‌రావు, రంజిత్,పెద్దపల్లి రవీందర్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



