తెలుగుదేశం పార్టీని ఢిల్లీలో తాకట్టు పెట్టారు
కాంగ్రెస్,టిడిపి కలయిక ప్రభావం తెలంగాణలో నిల్: ఈటల
కరీంనగర్,అక్టోబర్2(జనంసాక్షి): తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారని తెలంగాణ ఆపద్దర్మ మంత్రి ఈటెల రాజేందర్ విమర్శించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ పోరాడితే ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలయిక తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపబోదని అన్నారు. ఇక్కడ కూటమి పప్పులు ఉడకవని అన్నారు. తెలంగాణ ప్రజలు మరింత కసితో టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తారని ఈటల ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం నాడిక్కడ మాట్లాడుతూ చంద్రబాబు 195 కేసులు వేసి తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. బాబు ఢిల్లీ వెళ్లినప్పుడల్లా కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి పథకం కట్టవద్దని చెప్పి ఒత్తిడి తీసుకువచ్చారని ఆయన విమర్శించారు. టీడీపీ-కాంగ్రెస్ కలయికవల్ల తెలంగాణలో పంటపొలాలకు నీరు రావేమోననే భయం ప్రజల్లో నెలకొందని, మహాకూటమిని తెలంగాణ వ్యతిరేక కూటమిగా చూస్తారని ఆయన అన్నారు. చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పేకంటే తన రాష్ట్రాన్ని బాగా చూసుకోవాలని ఈటల సూచించారు. రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడిన ఏపీ సీఎం చంద్రబాబు, ఎంతోమంది బలిదానాలకు కారణమైన కాంగ్రెస్‌తో కోదండరాం జతకట్టడం సిగ్గుచేటని అన్నారు. కోదండరాం తెలంగాణకు ద్రోహం చేసిన చంద్రబాబుతో పొత్తుపెట్టకున్నాడో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. అధికార ధ్యాసతో కోదండరాం తెలంగాణలోతనకున్న గౌరవాన్ని పోగొట్టుకున్నారని అన్నారు. మహాకూటమి తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారనుందన్నారు.




