తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మడం లేదు
తెలంగాణపై మరో మారు లేఖ ఇవ్వాలి : కడియం
హైద్రాబాద్,జూలై 6(జనంసాక్షి):
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి తెలంగాణకు మద్దతుగా మరోసారి గళం ఎత్తారు. చాలా రోజుల తర్వాత గళం విప్పిన ఆయన తెలంగాణ అంశంపై తమ పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని ప్రజలు నమ్మడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తెదేపా మరోసారి స్పష్టమైన వైఖరిని వెల్లడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలోనే తెలంగాణ విషయంలో పార్టీ స్పష్టత ఇచ్చిందని చెప్పుకొంటున్నామని అయితే ప్రజలు ఎవ్వరూ తెలుగు దేశాన్ని నమ్మడం లేదన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ విజయం సాధించడం ప్రశ్నార్థకంగానే ఉందనీ, కొత్త రాజకీయ సమీకరణాలు ఇందుకు కారణమన్నారు. తెలంగాణ ఉద్యమం, జగన్ ఉత్థానం లాంటి అంశాలతో టీడీపీ నిలదొక్కుకోగలదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోందన్నారు. కాని పార్టీ నేతలు ఆశాభావంతోనే ఉన్నారనీ, 2014లో గెలవకపోయినా 2019లో గెలువగలమని ఇందుకు ఒక్కో ఇటుక పేర్చి ఇల్లు కట్టుకున్నట్టు పార్టీని పటిష్టం చేయాలని వారు భావిస్తున్నారు. ఇటీవల ఉప ఎన్నికలలో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో పార్టీ తుడిచిపెట్టుకుపోయిందనీ, ఈ సంగతి జ్ఞాపకం చేసుకునేందుకు పార్టీకి ఇష్టం లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర విభజన అంశం పార్టీలో సంక్షోభం సృష్టించిందన్నారు. ఈ సమస్య తీవ్రతను పార్టీ అగ్రనాయకత్వం అర్థం చేసుకోవటం లేదన్నారు. డోలాయమానంగా ఉండటం వల్లవచ్చే ఎన్నికల్లో పార్టీ తెలంగాణలో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. కేంద్ర నిర్ణయంపై రాష్ట్ర రాజకీయాలు ఆధారపడి ఉంటాయన్నారు. ఈ నిర్ణయం వైఎస్సార్ సీపీ, తెరాసల భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. టీడీపీ ఇప్పటికే తెలంగాణలో ప్రాభవం కోల్పోయింది. సీమాంధ్రలలో జగన్ గట్టి పోటీ నిస్తున్నారు. సొమ్ము, సానుభూతిలతో ఆయన ఓట్లను కొల్లగొడుతున్నారని చెప్పారు. తెలంగాణ నుంచి టీడీపీని తరిమేసేందుకు కాంగ్రెస్ అన్ని రకాల ప్రోత్సాహాన్ని ఇతర పార్టీలకు అందించిందన్నారు. రెండు కళ్ల విధానం కూడా టీడీపీకి నష్టం కలిగించిందన్నారు.