తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 24 : 37ఏళ్ల తరువాత రాష్ట్రంలో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహా సభలను జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించాలని, తద్వారా జిల్లాకు మంచిపేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి అందరు అధికారులు విశేషంగా, ప్రత్యేకంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ క్రిస్టినా కోరారు. ప్రపంచ తెలుగు మహా సభలను పురస్కరించుకొని శనివారం ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో మండల స్థాయి, మండల ప్రత్యేక అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, డిసెంబరు 27,28,29 తేదీలలో తిరుపతిలో నాల్గవ ప్రపంచ తెలుగు మహా సభలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందుకు జిల్లాలో గ్రామ స్థాయిలో నవంబరు 29,30 తేదీలలో, మండల స్థాయిలో డిసెంబరు 6,7 డివిజన్‌ స్థాయిలో 11,12 జిల్లా స్థాయిలో డిసెంబర్‌ 15,16,17 తేదీలలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో వ్యాసరచన, కవిత్వరచన, పద్యపఠనం, తెలుగు భాష క్విజ్‌, ఉపన్యాస పోటీలు, సదస్సులు లాంటి సాహిత కార్యక్రమాలు, నాటకం, ఏకపాత్రాభినయం, ఏకాంతిక నాటిక, నృత్యాలు, విచిత్ర వేషధారణ, భజనలు, పాటలు, ముఖాభినయం, ధ్వని అనుకరణ, మాయాజాలం లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, పరుగుపందెం మొదలైన క్రీడల పోటీలను అన్ని స్థాయిల్లో నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి ఈ మహాసభలకు సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లు, స్టిక్కర్లు, జెండాలు పంపించాలని, విద్యార్థులకు తెలుగు మహాసభల విశిష్టతను గురించి వివరించాలని, గ్రామ పెద్దలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువకులు, మహిళలు కలిసి నాలుగు దిక్కుల నుంచి ర్యాలీలు నిర్వహించాలని, విచిత్ర వేషాలు, పాటలు భజనలు, క్రీడ విన్యాసాలతో, తెలుగు నినాదాలతో ఊరేగింపులు నిర్వహించాలని, పండితులను, కళాకారులను మేధావులను సత్కరించాలని కలెక్టర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ హర్షవర్దన్‌, డిఆర్‌వో జగదీశ్వరాచారి, ఆర్‌డివోలు హన్మంత్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, శివలింగయ్య, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇంద్రసేన్‌, భూమి కొలతల ఏడి శ్రీధర్‌, శ్రీనివాసచారి, నగేష్‌ తదితరులు జిల్లా అధికారులు, ఎంపిడివోలు, తహశీల్దార్‌ తదితరులు పాల్గొన్నారు.