తెలుగు రాష్టాల్ల్రో మరిన్ని వర్షాలు
అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిచిన ఐఎండి
హైదరాబాద్,జూలై9(జనం సాక్షి): రెండు తెలుగు రాష్టాల్ల్రో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పేర్కొన్నది. భారీ వర్షాలకు గోదావరి పొంగి పొర్లుతున్నది. లంక గ్రామాలు నీట మునిగిపోయాయి. లోతట్టు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వీరి కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను సిద్ధం చేశారు.గత రెండు రోజులుగా వర్షాలు తెలుగు రాష్టాల్రను వణికిస్తున్నాయి. మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణాంధ్ర జిల్లాల్లో పెద్ద మొత్తంలో వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెప్పారు. ఉపరితల ఆవర్తనం, రుతు పవన ద్రోణి ప్రభావంతో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, రాయలసీమలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశమున్నదని, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు జల్లులు, మరికొన్ని చోట్ల
ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
భారీ వర్షాలతో గోదావరి వరద ఉధృతి పెరుగుతున్నది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటి మట్టం పెరిగింది. 1.15 లక్షల క్యూసెక్కుల వరదనీటిని కిందకు వదులుతున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ నీటిమట్టం 9.7 అడుగులకు చేరుకున్నది. 17 గేట్ల ద్వారా వరద జలాలను సముద్రంలోకి వదులుతున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఏకధారగా కురుస్తున్న వర్షాలకు లంక గ్రామాలు వణికి పోతున్నాయి. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. జిల్లాలో అధికారులకు సెలవులను రద్దు చేశారు. ఇటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి వీధులన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఆటంకాలు ఏర్పడ్డాయి.