తొలి టీట్వంటీలో రాణించలేకపోయిన బ్యాట్స్‌మెన్
కంగారుల ముందు చేతలెత్తేసిన టాపార్డర్
పిచ్ సహకరించలేదన్న కెప్టెన్ కోహ్లీ
విశాఖపట్టణం,ఫిబ్రవరి25(జనంసాక్షి): ఆస్టేల్రియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓటమిపై భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కంగారులను వారి సొంతగడ్డపై కంగారుపుట్టించిన కోహ్లీసేన సొంత వేదికపై పరాజయం పొందడాన్ని తట్టుకోలేక పోతున్నారు.చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ విజయం సాధించింది. కాగా, మ్యాచ్ ఓటమిపై తాజాగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరణ ఇచ్చాడు. బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణమని చెప్పాడు. తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని, వారి పోరాటం చూస్తే చాలా గర్వంగా ఉందన్నాడు. బుమ్రా అద్భుతం చేశాడని, అరంగేట్ర ఆటగాడు మయాంక్ కూడా బాగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడని చెప్పుకొచ్చాడు. తాము చివరి వరకు మ్యాచ్ ను తీసుకొస్తామని అసలు ఊహించలేదన్న విరాట్? టీ20ల్లో లో స్కోర్లతో నెగ్గడం చాలా కష్టమని తెలిపాడు. 15వ ఓవర్ వరకు పిచ్ బ్యాటింగ్‌కు ఏ మాత్రం సహకరించలేదని, అందుకే తమ బ్యాట్స్ మెన్లు వైఫల్యం చెందారని వివరించాడు. ఈ పిచ్‌పై 150 పరుగులు చేసుంటే విజయం సాధించేవాళ్లమన్నాడు. రాబోయే వరల్డ్ కప్ దృష్ట్యా రాహుల్, పంత్ లకు అవకాశం ఇచ్చామని తెలిపాడు. అలాగే ఆటగాళ్లు సైతం ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఐపిఎల్ లో పనిభారాన్ని తగ్గించు కోవాలని సూచించాడు. రెండు టీ-20ల సిరీస్‌లో భాగంగా విశాఖ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టీ-20 మ్యాచ్‌లో ఆస్టేల్రియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ మార్కస్ స్టోనిస్‌ని రనౌట్ కాగా.. ఆ తర్వాత కెప్టెన్ ఆరోన్ ఫించ్(0) బుమ్రా బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. దశలో మ్యాక్స్‌వెల్ జట్టుకు అండగా నిలిచాడు. 43 బంతుల్లో 6 ఫోర్లు, రెండు సిక్సులతో 56 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి షార్ట్(37) మంచి మద్దతునిచ్చాడు. అయితే చాహల్ వేసిన 14వ ఓవర్ మూడో బంతికి మ్యాక్స్‌మెల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన బ్యాట్స్‌మెన్లు పెద్దగా రాణించలేదు. అయితే చివరి బంతిలో 2 పరుగులు కావాల్సి ఉండగా.. ప్యాట్ కమ్మిన్స్, రిచర్డ్‌సన్ జాగ్రత్తగా ఆడి జట్టు విజయాన్ని కట్టబెట్టారు. దీంతో ఆస్టేల్రియా భారత్‌పై 3 వికెట్ల తేడాతో ?విజయం సాధించి.. సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.