త్వరలోనే కమిషన్‌ బాకీ చెల్లిస్తాం

సహకార సంఘాలకు బాకీపై అధికారుల వెల్లడి
కామారెడ్డి,నవంబర్‌25( జనంసాక్షి): వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పౌర సరఫరాల శాఖ ద్వారా కొనుగోలు కేంద్రాలకు రూ.20 కోట్ల కవిూషన్‌ బకాయి అందాల్సి ఉంది. అయితే సహకార సంఘాలకు కవిూషన్‌ సొమ్ము మంజూరు కోసం ప్రతిపాదనలు పంపించామని జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ అభిషేక్‌ సింగ్‌ తెలిపారు. ఈ సీజను కొనుగోళ్లు ముగిసిపోయేలోపు కవిూషన్‌ సొమ్ము మంజూరు అయ్యే అవకాశం ఉందన్నారు.  మరోవైపు సహకార సంఘాలకు కవిూషన్‌ బకాయి వసూలు కాకపోవడంతో సంఘాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజను వరి ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. అయితే గడచిన ఖరీఫ్‌, రబీ సీజను నెలల కవిూషన్‌ ఇంతవరకు చెల్లించకపోవడంతో సంఘాలకు బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలోని 87 సహకార సంఘాల ఆధ్వర్యంలో 230 కొనుగోలు కేంద్రాలు కొనసాగాయి. గడచిన ఖరీఫ్‌, రబీ సీజనులలో భారీ మొత్తంలో వరి ధాన్యం కొనుగోలు చేశారు. ప్రతి క్వింటాలుకు నిర్ణయించిన మేరకు కవిూషన్‌ను పౌర సరఫరాల శాఖ కొనుగోలు కేంద్రాలను నిర్వహించిన సహకార సంఘాలకు ఇస్తూ ఉంటుంది. సాధారణంగా ఏ సీజను కవిూషన్‌ ఆ సీజనులోనే చెల్లించాల్సి ఉంది. కాగా ఇప్పటి వరకు ప్రభుత్వం పౌర సరఫరాల శాఖకు నిధులు కేటాయించకపోవడంతో కవిూషన్‌ బకాయిలు పేరుకుపోయాయి. అనేక సహకార సంఘాలు కొనుగోలు కవిూషన్‌ను సిబ్బంది జీత భత్యాలకు చెల్లిస్తున్నాయి. ఒక్కో సహకార సంఘంలో సిబ్బందికి నెలకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు వేతనం చెల్లించాల్సి ఉంటుంది. ఎరువుల విక్రయం ద్వారా లభించే లాభాన్ని సహకార సంఘాల నిర్వహణకు వినియోగిస్తుండగా కొనుగోలు కవిూషన్‌ నుంచి సిబ్బందికి జీత భత్యాలను చెల్లిస్తున్నారు. సహకార సంఘాలు ఆర్థికంగా బలంగా ఉన్నా కవిూషన్‌ బకాయి పేరుకుపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలోని ప్రతి సహకార సంఘానికి ఎక్కువ మొత్తంలోనే కవిూషన్‌ రావాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు కవిూషన్‌ సొమ్మును సహకార సంఘాలకు అందించాలని పలువురు కోరుతున్నారు.