దళిత బిడ్డననే నాపై కేసీఆర్‌ వివక్ష

18ఏళ్లుగా టీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్నా

– టికెట్‌ పై స్పష్టత ఇవ్వకుండా తనను మనోవేదనకు గురిచేస్తున్నారు

– తనపై ఫిర్యాదు చేసిన వారికి టికెట్‌ ఇస్తే సహించేది లేదు

– టీఆర్‌ఎస్‌ నేత బొడిగె శోభ

కరీంనగర్‌, నవంబర్‌1(జ‌నంసాక్షి) : 18ఏళ్లుగా టీఆర్‌ఎస్‌కోసం కష్టపడి పనిచేస్తున్నా.. దళిత బిడ్డననే తనపై కేసీఆర్‌ వివక్ష చూపుతున్నారని, తన టికెట్‌పై స్పష్టత ఇవ్వకుండా మనోవేదనకు గురిచేస్తున్నారని టీఆర్‌ఎస్‌ నేత బొడిగె శోభ అన్నారు. గురువారం చొప్పదండి నియోజకవర్గంలో బొడిగె శోభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దళిత బిడ్డనైన తనపై కేసీఆర్‌ వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. తనపై ఫిర్యాదు చేసిన వారికి టికెట్‌ ఇస్తే ఊరుకునేదిలేదని, తప్పకుండా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని బొడిగె శోభ స్పష్టం చేశారు. 18ఏళ్లుగా టీఆర్‌ఎస్‌లో పనిచేశానని, తనతో లబ్దిపొందినవారే తనను దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 60 రోజులు ఓపిక పట్టానని తెలిపారు. తన విూద ఫిర్యాదు చేసిన వారికి టికెట్‌ ఇస్తే సహించే ప్రస్తక్తే లేదని తేల్చి చెప్పారు. చొప్పదండి నుంచి దళిత బిడ్డకు అవకాశం ఇవ్వాలని.. అది కూడా తనకు (బొడిగ శోభ)కు ఇవ్వాలని సీఎంను కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అరెస్టు చేసినప్పుడు తాను కారం పొడి పట్టుకుని నిలబడ్డానని తెలిపారు. కేసీఆర్‌

ప్రకటించిన 107 మంది అభ్యర్థులలో ఒక్క దళిత మహిళ కూడా లేరని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పిలుపు కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఎంపీ కవిత, కేశవరావు, మంత్రి హరీష్‌రావు, మంత్రి ఈటెల రాజేందర్‌ను కలిశానని తెలిపారు. తన పని ప్రకారం సీటు ఇవ్వాలనకుంటే.. చొప్పదండి సీటు తనకే ఇవ్వాలన్నారు. ఒక మాదిగ బిడ్డను అభ్యర్థిగా ప్రకటించడంలో ఇంత జాప్యమా అని వాపోయారు. ఓట్ల దగ్గర దళిత మహిళల అవసరం ఉంటుంది… కానీ ఒక దళిత మహిళ అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఆలస్యం చేస్తారా అని ప్రశ్నించారు. ఇది ఏ విధంగా ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందని బొడిగ శోభ కేసీఆర్‌ను ప్రశ్నించారు.