దసరా పండుగకు ఊర్లకు వెళ్ళే వారు జాగ్రత్త వహించాలి: ఎస్సై డి.సుధాకర్

 

జనంసాక్షి/చిగురుమామిడి (సెప్టెంబర్ 30)

బతుకమ్మ,దసరా పండుగల కోసం పొరుగు ఊర్లకు వెళ్తున్నారా అయితే జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు చిగురుమామిడి పోలీసులు. ఇళ్లకు భద్రంగా తాళం వేసి పక్కింటి వారికి కానీ పోలీసులకు కానీ సమాచారం ఇచ్చి తగు జాగ్రత్తలు తీసుకోని ఊర్లకు వెళ్లాలని ఎస్సై డి.సుధాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దసరా పండగ సందర్భంగా గ్రామాల్లో జమ్మి పూజలు, దేవి విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను ఎటువంటి ఘర్షణలకు తావివ్వకుండా నిర్వాహకులు నిబంధనలను పాటించాలని, ఉత్సవాలలో అల్లర్లు సృష్టించి ఘర్షణలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో దుర్గాదేవి విగ్రహాలు నెలకొల్పారని ప్రజలు సామరస్యంగా భక్తి భావంతో వేడుకలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించుకోవాలని నవరాత్రోత్సవాల సందర్భంగా డిజెలకు అనుమతులు లేవని, పోలీస్ హెచ్చరికలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై కేసులు నమోదు చేసి డీజేలను సీజ్ చేస్తామని,అసాంఘిక శక్తుల కదలికలు సమస్యాత్మక గ్రామాలపై కూడా నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ జరుపుతున్నామని ఎస్సై సుధాకర్ పేర్కొన్నారు.