దాడి కారకుల నుంచి పరిహారం రాబడతాం

జెఎన్‌యూ దాడి ఉన్మాద చర్య: విసి
న్యూఢిల్లీ,జనవరి7(జనంసాక్షి):  జవహర్లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థులు, టీచర్లపై భయానక దాడి దురదృష్టకరమని, బాధాకరమని వైస్‌ ఛాన్స్‌లర్‌ మామిడాల జగదీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. విధ్వంసానికి పాల్పడినవారిని బాధ్యులుగా చేసి, వారి నుంచి నష్టపరిహారం వసూలు చేస్తామని చెప్పారు.
జేఎన్‌యూలో రెండు రోజుల క్రితం జరిగిన విధ్వంసకాండలో 34 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ముసుగులు ధరించిన వ్యక్తులు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ప్రవేశించి ఇనుప చువ్వలతో దాడి చేశారు.
ఈ నేపథ్యంలో వీసీ జగదీశ్‌ మాట్లాడుతూ చర్చలకు వేదికగా జేఎన్‌యూకు మంచి పేరు ఉందన్నారు. ఇకపై నూతన జీవితాలను ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు. జగదీశ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన ఆదివారం జరిగిన ఈ దాడిపై స్పందించడం లేదని, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్లు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వీసీ మాట్లాడుతూ ఆదివారం జరిగిన దాడికి బాధ్యులను గుర్తించి, వారి నుంచి నష్టపరిహారం వసూలు చేస్తామని తెలిపారు. గాయపడిన విద్యార్థుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. ఈ దాడి చాలా దురదృష్టకరమని తెలిపారు. ఎటువంటి సమస్యలనైనా పరిష్కరించేందుకు చర్చలు జరుగుతాయనే మంచి పేరు జేఎన్‌యూకు ఉందని తెలిపారు. హింస ఓ పరిష్కారం కాదన్నారు. గతం మర్చిపోయి, కొత్త జీవితాలను ప్రారంభించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇదిలావుండగా, జేఎన్‌యూ రిజిస్టార్ర్‌ ప్రమోద్‌ కుమార్‌ మాట్లాడుతూ ఆదివారం జరిగిన దాడులపై ప్రొక్టోరియల్‌ ఎంక్వైరీ జరుగుతోందని తెలిపారు. ప్రాంగణంలో హింస గురించి భద్రతా విభాగం నుంచి నివేదిక వచ్చిన తర్వాత హింసకు బాధ్యులను గుర్తించి, చర్యలు తీసుకుంటామన్నారు.