దాడుల సంస్కృతికి మనకెక్కడిది?
రాజకీయాల్లో దాడులు, ప్రతిదాడులు, భౌతికదాడులు, ప్రత్యుర్థులను తుడిచి పెట్టడం లాంటి పదాలు ప్రశాంతమైన తెలంగాణలో ఇంతుకుముందు ఎప్పుడూ విని ఉండం. ఎందుకంటే ఇక్కడ రాజకీయ ప్రత్యర్థలంటూ శాశ్వతంగా ఉండరు. ఎన్నికల సమయంలో పార్టీల వారీగా వైఖరి చెప్పుకోవడం మినహా గతంలో వ్యక్తిగత దూషణలకు దిగిన సందర్భాలూ తక్కువే. ఇప్పటికీ అలాంటి వాతావరణం కనిపించని నియోజకవర్గాలెన్నో ఉన్నాయి. ఎన్నికల అనంతరం అన్నదమ్ముల్లా కలిసి తిరిగే నాయకులు ఇంకా ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో తెలంగాణలోనూ దాడుల రాజకీయాలు మొదలయ్యాయి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం వీటికి కేంద్రంగా మారింది. రాయలసీమలో హింసారాజకీయాలు అత్యంత సాధారణం. అక్కడ రౌడీషీటర్ కాకుండా రాజకీయ నాయకులు కానివారు దుర్భిణి వేసి వేదికినా కనిపించరు. రాయలసీమ రాజకీయాల్లో ఫ్యాక్షన్లు పాత్ర తక్కువేమి కాదు. ఇప్పటికే ఎన్నో తరాలు ఈ పోరాటంలో తుడిచిపెట్టుకుపోయాయి. అలాంటి హత్యా రాజకీయాలకు పెట్టింది పేరైన వైఎస్ రాజారెడ్డి కూర్చున్న అతి పెద్ద పదవి పులివెందుల సర్పంచ్. అలాగని ఆయన గ్రామానికే పరిమితమైన నేత కాదు. తన ఫ్యాక్షన్ ప్రాభవంతో జిల్లా రాజకీయాల్లోనూ స్థానం దక్కించుకున్నారు. తనకు దక్కని పదవులు తనయుడు రాజశేఖర్‌రెడ్డి అధిరోహించాలని కలలు కన్నాడు. ఆయన కలలను సాకారం చేసేందుకు రాజశేఖర్‌రెడ్డి ఫ్యాక్షన్ పంథానే అవలంబించాడు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో మత కల్లోలాలు సృష్టించిన మహానుభావుడు ఆయనేనని ఇప్పటికీ అందరూ బాహాటంగానే చెప్తుంటారు. ఆయన వారసత్వాన్ని అచ్చంగా పునికి పుచ్చుకున్న జగన్మోహన్‌రెడ్డి తెలంగాణలో తన పార్టీ ఉనికిని చాటుకోవడానికి హత్యా రాజకీయాలతో ప్రమేయం ఉన్న కొండా దంపతులను ఉపయోగించుకుంటున్నాడు. తనది విప్లవ నేపథ్యమని చెప్పుకునే కొండా మురళి రాజకీయంగా ఎదిగేందుకు హత్యా రాజకీయాలను ఎంచుకున్నాడు. ఒకనాటి తన సహచరుడు ప్రతాప్‌రెడ్డి హత్య చేసి రాష్ట్రస్థాయిలో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరింపజేయాలని ప్రయత్నించాడు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వరంగల్ జిల్లాలో కొండా మురళి రాజకీయ ఆగడాలకు అడ్డే లేకుండాపోయింది. ఆయన సతీమణి సురేఖ అప్పటి శాయంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది శాసనసభ స్థాయిలో ఈయన ఆగడాలకు అడ్డంగా ఉండేది. వైఎస్ సహకారం ఎట్లాగూ ఉంది. దీంతో మురళి రెచ్చిపోయి సెటిల్‌మెంట్లు, భూదందాలతో వరంగల్‌లో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరతీశారు.
వారికి అడ్డుగా నిలిచిన వారిని నయానో భయానో ఒప్పించడం, అక్కడికీ వినకుంటే అడ్డుతొలగించుకోవడం ఇక్కడ నిత్యకృత్యమే. హన్మకొండ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా సురేఖకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని పరకాల మండలానికి చెందిన నాయకులు ఓ టీడీపీ కార్యకర్తను కొట్టి చంపేశారు. ఇలాంటి సంఘటనలు మరెన్నో చోటుచేసుకున్నాయి కూడా. వైఎస్ రెండో సారి అధికారం చేపట్టగానే వరంగల్‌లో తన ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న మురళి భార్య సురేఖకు మంత్రివర్గంలో చోటు కల్పించాడు. వైఎస్ కుటుంబంతో వివిధ వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్నరానే ఆరోపణలు ఎదుర్కొంటున్న కొండా దంపతులు వైఎస్ మరణానంతరం అనివార్యంగా జగన్ పంచన చేరారు. రైతు సమస్యలపై అసెంబ్లీలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి కాంగ్రెస్ నుంచి సురేఖ బహిష్కృతులయ్యారు. అనంతరం నిర్వహించిన పరకాల ఉప ఎన్నికల్లో ఎంత ప్రలోభపెట్టినా, ఎన్ని మార్గాలో భయభ్రాంతులకు గురిచేసినా పరకాల ఓటర్లు తెలంగాణ రాజకీయ జేఏసీ బలపరిచిన టీఆర్‌ఎస్ అభ్యర్థినే ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. అప్పటి నుంచి పరకాలపై, వరంగల్ జిల్లాలో ఉనికిని చాటుకునేందుకు కొండా దంపతులు అనేక మార్గాల్లో ప్రయత్నిస్తూనే ఉన్నారు. కేంద్రం హోం మంత్రిత్వ శాఖ ఈనెల 28న అఖిలపక్షం నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని పార్టీల అధ్యక్షులే సమావేశానికి హాజరుకావాలనే ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబాన్ని రక్షించేందుకు సురేఖ టీఆర్‌ఎస్‌ను, టీ జేఏసీని టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే టీఆర్‌ఎస్ శ్రేణులపై కవ్వింపు చర్యలకు పాల్పడేలా చేసి కొండా దంపతులు ప్రతిదాడులకు స్కెచ్ వేసినట్లుగా అనిపిస్తోంది. అందులో భాగంగానే వరంగల్ టీఆర్‌ఎస్ కార్యాలయంపై దాడి జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. హత్యా రాజకీయాల్లో తలపండిన కొండా మురళి రాయలసీయ ఫ్యాక్షనిస్టులతో చేరి సొంత జిల్లా వారిపై దాడులకు తెగపడటం ఎంత వరకు సమంజసం. ప్రజాస్వామ్య వాదులంతా దాడిని ముక్తకంఠంతో ఖండించినా వైకాపా నేతలు మాత్రం వితండవాదనకు దిగారు. ఇక్కడ వారంతా గుర్తించ వలసింది ఒక్కటే. ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీల్లో వారు ఉండొచ్చు కానీ ప్రజల ఆకాంక్షలను మాత్రం గౌరవించి తీరాల్సిందే. కాదు కూడదు అన్న వారిలో ఎందరో మహోమహులు కాలగర్భంలో కలిసిపోయారు. కనీసం రాజకీయ వేదిక కరువై తమ గతమెంతో ఘనమని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవారు, ప్రజల ఆకాంక్షలకు దూరంగా ఉండే వారు తమ రాజకీయ అజెండా అమలు చేసుకుంటూ పోతే ప్రజలు ఎంతకాలం ఓపిక పడుతారనుకుంటే పొరపాటే. చలిచీమలు కూడా కాలనాగును అంతం చేసిన ఉదంతాలు మనందరికీ విధితమే. ప్రజలు తలుచుకుంటే ఇలాంటి హత్యారాజకీయవాదులను ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు పోటుతో భూస్థాపితం చేసేస్తారు. తెలంగాణలో ఒక్క కొండా దంపతులే కాదు మెదక్ జిల్లాలో తూర్పు జగ్గారెడ్డి, మరికొన్ని చోట్ల మంత్రుల అనుచరులు ఇలాంటి దాడుల రాజకీయాల్నే చేస్తున్నారు. అలాంటి వారంతా వైఎస్ బతికున్నంతకాలం ఆయన అనుచరులే. అంటే ప్రశాంతమైన తెలంగాణ రాజకీయాల్లో హత్యా రాజకీయాలను చొప్పించిన వైఎస్ భౌతికంగా లేకపోయినా ఆయన వదిలిన అనుచర మూక ఇంకా అవే రాజకీయాలు కొనసాగిస్తోంది. కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో అధికారానికి దూరమవుతుందనే నిఘా వర్గాల అంచనాలతో ఇప్పటి నుంచి ఒకప్పటి వైఎస్ మందీమార్బలంలో భాగస్వాములు జగన్ గూటికి చేరేందుకు దాడుల రాజకీయాలకు తెగబుతున్నారు. వారంతా ఒక్కటి గుర్తించుకుంటే మంచిది తెలంగాణ రాజకీయాల్లో దాడుల సంస్కృతికి చోటు లేదు. కాదు కూడదు అంటే ప్రజలు చేతులు ముడుచుకుని కూర్చుంటారనుకోవడం వారి రాజకీయ అజ్ఞానమే అవుతుంది.