దానం, కడియంలకు మరోసారి నోటీసులు

` పోచారం, అరికెపూడిలను విచారించిన స్పీకర్‌
హైదరాబాద్‌్‌(జనంసాక్షి): సుప్రీం మరో నాలుగు వారాల గడువు ఇవ్వడంతో పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ నోటీసులు జారీ చేశారు. గురువారం పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడి గాంధీలను విచారించారు. పదిమందిలో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటి వరకు అఫిడవిట్‌లు దాఖలు చేయని పరిస్థితి. ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి.. స్పీకర్‌ నోటీసులకు స్పందించని విషయం తెలిసిందే. దీంతో వారిరువురికి స్పీకర్‌ మరోసారి నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని అసెంబ్లీ స్పీకర్‌ స్పష్టం చేశారు. ఇక.. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేల విచారణ గురువారంతో ముగిసింది. కేసు విచారణ ఆలస్యంపై సుప్రీం సీరియస్‌ అవడంతో పాటు నాలుగు వారాలు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణలో వేగం పెంచాలని అసెంబ్లీ స్పీకర్‌ నిర్ణయించారు. ఇందులో భాగంగా రెండో విడత విచారణలో భాగంగా నలుగురు ఎమ్మెల్యేలను విచారణకు పిలిచారు. ఉదయం ఎమ్మెల్యేల విచారణ మొదలైంది. పోచారం శ్రీనివాస్‌ రెడ్డి వర్సెస్‌ జగదీశ్‌ రెడ్డి కేసును స్పీకర్‌ విచారించారు. ఇరు వర్గాల వాదనలను స్పీకర్‌ విన్నారు. అలాగే మధ్యాహ్నం అరికెపూడి గాంధీ వర్సెస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ కేసు విచారించారు. వీరి విచారణతో మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి అవుతుంది. మరోవైపు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఢల్లీి వెళ్లారు. ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ముగియనున్నప్పటికీ ఇప్పటి వరకు దానం అఫిడవిట్లు దాఖలు చేయలేదు. విచారణకు హాజరైతే వేటు పడుతుందని దానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వేటు పడితే ఆరు సంవత్సరాల పాటు పోటీ చేయడానికి నో ఛాన్స్‌. ఈ క్రమంలో రాజీనామా చేసేందుకు దానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రాజీనామా చేస్తే తన పరిస్థితి ఏంటని పార్టీ పెద్దలతో దానం సంప్రదింపులు జరుపనున్నట్లు తెలుస్తోంది.