దివంగత రమ్య ఇంటికి ఎస్సీ కమిషన్ రాక
బిజెపి నేతలు, కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
గుంటూరు,అగస్టు24(జనంసాక్షి): ఇటీవల దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. విచారణ నిమిత్తం రమ్య ఇంటికి జాతీయ ఎస్సీ కమిషన్ కమిటీ వెళ్లింది. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కాగా కమిషన్ వెంట వైసీపీ నేతల వాహనాలను పోలీసులు పంపడంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ సందర్భంగా బీజేపీ నేత సాధినేని యామిని ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ జై జగన్ అంటే పోలీసులు వైసీపీ శ్రేణులను పంపిస్తున్నారని, మమ్మల్ని అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయని సాధినేని యామిని విమర్శించారు. ముఖ్యంగా దళితులపై దారుణాలు పెరిగిపోయాయన్నారు. అన్యాయం జరిగిన తర్వాత పరిహారం ఇస్తున్నామని చెబుతూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. నిర్బయ చట్టాన్ని అమలుపరచకుండా ప్రభుత్వం ప్రజలకు మోసపూరితమైన హావిూలు ఇస్తూ మోసం చేస్తోందని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు, దళితులకు రక్షణ లేదని సాధినేని యామిని తీవ్రస్థాయిలో విమర్శించారు.