దుర్గాఘాట్‌లో పారిశుధ్య సమస్య

తీవ్ర ఇబ్బందులు పడుతున్న భక్తులు
విజయవాడ,మే18(జ‌నం సాక్షి ): నిత్యం భక్తులతో కళకళలాడే దుర్గాఘాట్‌ వద్ద చెత్తాచెదారం పేరుకు పోవడంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ పారిశుద్యం లోపించిందని అన్నారు. నిత్యం వచ్చే భక్తులు  స్నానాలు చేయాలంటేనే భయం వేస్తోందని అన్నారు. వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వేలాది మంది భక్తులు ఇక్కడే పుణ్య స్నానాలు ఆచరించి దుర్గమ్మ దర్శనానికి వెళ్తారు. కానీ, అందుకు సరిపడా సౌకర్యాలు మాత్రం ఇక్కడుండవు. నదిలో సబ్బులు, షాంపుల వాడకంపై నిషేధం ఉన్నా ఘాట్‌ మెట్లపైనే వీటి విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. నిషేధం తెలియని భక్తులు వాటిని కొని నదిలోనే స్నానం చేస్తున్నారు. బ్రష్‌ చేసుకోవడానికి సరైన సౌకర్యాలు లేక నదిలో కానిస్తున్నారు. విడిచిన దుస్తులు మెట్లపైనే వదిలేస్తున్నారు. ఇంకొందరు చిన్నపిల్లల కాలకృత్యాలకు ఈ ఘాట్‌నే వినియోగిస్తున్నారు. ఇక నాచు పట్టిన మెట్లు భక్తుల నడకకు పరీక్ష పెడుతున్నాయి. ఇటీవల కలెక్టర్‌ లక్ష్మీకాంతం దుర్గాఘాట్‌ను సందర్శించి ఘాట్‌ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించినా అధికారులెవరూ నామమాత్రపు చర్యలు కూడా తీసుకోకపోవడం విచారకరం. ఇక్కడ పారిశుద్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు.