దుర్వినియోగమైన ‘ఉపాధి’ నిధులను రికవరి చేయాలి : కలెక్టర్
కడప, జూలై 29 : 2006 నుంచి 2009 సంవత్సరం వరకు ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగం అయిన నిధులను ఉపాధి హామీ విజిలెన్స్ అధికారులు రికవరి చేయాలని జిల్లా కలెక్టర్ వి.అనిల్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టర్ ఛాంబర్‌లో ఉపాధి హామీ పథకం పనుల నిర్వహణపై జిల్లా స్థాయి ఉన్నత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2006 సంవత్సరం నుంచి జరిగిన ఉపాధి హామీ పథకం పనులలో సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్‌పిటిసిల ద్వారా కొంత వరకు ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం అయినట్లు సోషియల్ అడిట్ ద్వారా గుర్తించడం జరిగిందన్నారు. దుర్వినియోగం అయిన నిధులను సంబంధిత అధికారులు, నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారికి నోటీసులు జారీ చేసి సామరస్యంగా నిధులు వసూలు చేయాలన్నారు. కొన్ని మండలాలలో సర్పంచ్‌ల ద్వారా అసంపూర్తిగా నిలిచిపోయిన ఉపాధి హామీ పనులు తిరిగి ప్రారంభించి పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం పనుల నిర్వహణలో కడప జిల్లా మొదటి స్థానంలో ఉండేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ఉపాధి పనులు నాణ్యతతో ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. కంప్యూటర్‌లు మరమ్మతులకు గురికావడం, ఆపరేటర్ల సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డ్వామా పిడి మధుభూషణ్‌రెడ్డికి సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న ఉపాధి పనులలో ఎటువంటి లోపాలు లేకుండా నిష్పక్షపాతంగా జరపాలన్నారు. కూలీల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకూడదన్నారు. గతంలో ఫీల్డ్ అసిస్టెంట్‌లు అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు వచ్చాయన్నారు. అలాంటి సమస్యలు తిరిగి పునరావృత్తం కాకుండా ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. జిల్లాలో ఇందిరజల ప్రభ కింద కొత్తగా 53 బోరు బావులు వేయడం జరిగిందన్నారు. వీటికి త్వరలో కరెంట్ కనెక్షన్ ఇచ్చి పంట పోలాలకు నీటి సరఫరా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పిడి మధుభూషన్‌రెడ్డి, జిల్లా పంచాయితీ అధికారి మున్వర్ అలీ, ఉపాధి హామీ పథకం జిల్లా విజిలెన్స్ అధికారి వెంకటస్వామి, అసిస్టెంట్ డివివో సిరాజిద్దిన్, ఎంపిడివోలు తదితరులు పాల్గొన్నారు.