దెబ్బతిన్న రోడ్లకు తక్షణ మరమ్మత్తులు

బాచారం వద్ద కల్వర్లు పనులను పరిశీలించిన మంత్రి సబిత

వికారాబాద్‌,జూలై13(జనంసాక్షి :): వర్షాల వల్ల పాడైన రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆర్‌ అండ్‌ బీ అధికారులను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఎక్కడా రవాణాకు ఇబ్బంది లేకుండా
తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వికారబాద్‌ జిల్లాలోని ధారూర్‌ మండలం బాచారం వాగు వద్ద నిర్మిస్తున్న కల్వర్టు పనులను బుధవారం ఆమె పరిశీలించారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై క్షేత్ర స్థాయిలో పర్యటించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నదుల వద్ద పోలీస్‌, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించాలని, ప్రవాహ వేగాలు గమనించకుండా వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. మంత్రితో పాటు ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ , పైలట్‌ రోహిత్‌ రెడ్డి, కలెక్టర్‌ నిఖిల, ఎస్పీ కోటిరెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ విజయ్‌ కుమార్‌, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు మనోహర్‌ రెడ్డి, కృష్ణారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.