దేశంలోని నిరుపేదలకు న్యాయమందించండి

నిరక్షరాస్యులను జాగృతం చేయండి
నల్సర్‌ స్నాతకోత్సవంలో మొయిలీ
హైద్రాబాద్‌, సెప్టెంబర్‌2 (జనంసాక్షి):
దేశంలోని పేదలకు న్యాయం అందించాలని, ఆ దిశగా నిరక్ష్యరాస్యులను జాగృతం చేయాలని కేంద్ర మంత్రి విద్యుచ్చక్తి, కార్పోరేట్‌ వ్యవహారాల శాఖా మంత్రి వీరప్ప మెయిలీ న్యాయ విద్యార్థులకు సూచించారు. ఆదివారం రంగారెడ్డి జిల్టా శామీర్‌పేట్‌లోని నల్సార్‌ విశ్వవిద్యాలయ పదో స్నాతకోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఉన్న నిరుపేదలకు, నిక్ష్యరాస్యులకు చట్టాల గురించి అవగాహన లేనందున న్యాయ విద్యార్థులు ఆ దిశగా ముందుకుసాగాలని తెలిపారు. ప్రపంచంలోనే ఎక్కువగా యువతను కల్గి ఉన్నది భారతదేశమేనని, దీనిని భారతదేశానికి అనుకూలంగా మార్చుకోవాలన్నారు. దేశంలో ఉన్న యువ శక్తిని సక్రమంగా ఉపయోగిం చుకుంటే మన దేశం ప్రపంచంలోనే గొప్ప శక్తిగా ఎదుగుతుందన్నారు. ప్రపంచంలోనే నంబర్‌వన్‌ అయ్యేసత్తా భారత్‌కు ఉందన్నారు. భావి తరాలకు ఉపయోగపడేవిధంగా యువకులు తమ విజ్ఞానాన్ని ఉపయోగించాలన్నారు. చట్టాల్లో ఉన్న విజ్ఞానాన్ని యువత ప్రజలకు అందించాలని, తద్వా రా వారిలో అవగాహన కల్పించాలన్నారు. దేశంలో చాలా
పెద్ద మొత్తంలో కేసులు కోర్టుల్లో పేరుకు పోతున్నాయని, వీటి పరిష్కారానికి న్యాయ విద్యార్థులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో 36 బంగారు పతకాలను గెల్చుకొన్న 15 మంది విద్యార్థులకు ఆయన పతకాలను అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రఘోష్‌, నల్సార్‌ రిజిస్ట్రార్‌ శర్మ వైస్‌ చాన్సలర్‌ ఫైజాఖాన్‌, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.