దేశంలో ఆర్థిక మందగమనం సాగుతుంది

– గత ఏడేళ్లతో పోలిస్తే జీడీపీ 5శాతానికి పడిపోయింది

– పేద, ధనిక వర్గాల మధ్య భారీ తేడా ఉంది

– రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ ఆనంద్‌ శర్మ

న్యూఢిల్లీ, నవంబర్‌27(జనం సాక్షి) : దేశంలో ఆర్థిక మందగమనం సాగుతుందని, పేద, ధనిక వర్గాల మధ్య భారీ తేడా ఉందని కాంగ్రెస్‌ ఎంపీ ఆనంద్‌ శర్మ అన్నారు. బుధవారం రాజ్యసభలో దేశ ఆర్థిక స్థితిపై చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా ఆనంద్‌ శర్మ మాట్లాడారు. దేశంలో పేద, ధనిక వర్గాల మధ్య భారీ తేడా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆ తేడా చాలా భయానకంగా మారినట్లు ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం ఇండియాలోనే ఉందన్నారు. దేశంలో ఆర్థిక మందగమనం సాగుతోందన్నారు. గత ఏడేళ్లతో పోలిస్తే.. జీడీపీ 5శాతానికి పడిపోయిందన్నారు. ఆటో, టెక్స్‌టైల్‌ రంగంలో సుమారు 25 లక్షల ఉద్యోగాలు కోల్పోయారన్నారు. నిరుద్యోగం 8శాతం ఉందన్నారు. జాతీయ పెట్టుబడులు తగ్గాయని ఆనంద్‌ శర్మ అన్నారు. పరిశ్రమలు ఉత్పత్తి చేయడంలేదని, దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా ఖర్చు చేయడంలేదన్నారు. ప్రైవేటు రంగం వద్ద కావాల్సినంత పెట్టుబడి లేదన్నారు. నోట్ల రద్దు చర్యను శర్మ తీవ్రంగా ఖండించారు. హడావుడిగా 2016లో నోట్ల రద్దు చర్యను చేపట్టారన్నారు. జీడీపీలో 40శాతం వచ్చే అసంఘటిత రంగం దెబ్బతిన్నదన్నారు. 90శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారన్నారు. పరిశ్రమల నష్టాలకు నోట్ల రద్దే కారణమన్నారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ బాగాలేదని, కానీ ప్రభుత్వం దీన్ని అంగీకరించడం లేదన్నారు. దివాళా నుంచి గ్టటెక్కేందుకు పెద్ద కంపెనీలకు రుణ సహాయం చేస్తే, ఆ కంపెనీలు డబ్బును పెట్టుబడులకు వాడుకుంటున్నాయన్నారు. లాభాల బాటలో ఉన్న పీఎస్‌యూలను అమ్మేస్తున్నారన్నారు. కొన్నేళ్ల పాటు స్థిరంగా 9శాతం అభివృద్ధి సాధిస్తేనే.. దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ల డాలర్లుగా మారుతుందని శర్మ తెలిపారు.