దేశంలో ఉల్లిధరలపై ప్రజల మండిపాటు

 

 

దిగుమతులతో ధరలకు కళ్లెం వేయాలని నిర్ణయం

న్యూఢిల్లీ,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ఉల్లి ధరలు కన్నీరు పెట్టిస్తున్నాయి. నాసిరకం ఉల్లిగడ్డలను వందకు తక్కువగా అమ్మడంలేదు. దీంతో కొనుగోళ్లకు ప్రజలు దూరంగా ఉంటున్నారు. అలాగే వాడకాన్ని కూడా తగ్గించారు. ఈ దశలో దేశంలో ఆకాశన్నంటిన ఉల్లి ధరలకు కేంద్రం క్లళెం వేసేందుకు రంగంలోకి దిగింది. టర్కీ దేశం నుంచి 11000 మెట్రిక్‌ టన్నులు, ఈజిప్టు నుంచి 6,090 మెట్రిక్‌ టన్నుల ఉల్లిగడ్డలను దిగుమతి చేసుకునేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. టర్కీ,ఈజిప్టు దేశాల నుంచి ఉల్లి దిగుమతికి కేంద్ర పౌరసరఫరాల మంత్రిత్వశాఖ ఆదేశాలతో మెటల్స్‌ అండ్‌ మినరల్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆర్డరు పెట్టింది. ఈజిప్టు నుంచి ఉల్లిగడ్డల రవాణ డిసెంబరు రెండో వారానికల్లా అవుతాయని కేంద్రమంత్రిత్వశాఖ అధికారులు చెప్పారు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఉల్లిని కిలో రూ.15.60లకు అందించేలా కేంద్రం నాఫెడ్‌ను ఆదేశించాలని ఢిల్లీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఇమ్రాన్‌ హుసేన్‌ కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ కు లేఖ రాశారు.ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌ రాష్టాల్లో ఉల్లి ధరలు కిలో వందరూపాయలకు చేరాయి. ఉల్లిని విదేశాలకు ఎగుమతి చేయకుండా కేంద్రం నిషేధం విధించడం ద్వారా కేంద్రం వీటి ధరలను నియంత్రించాలనుకుంది.దేశంలో ఉల్లి ధరలను అదుపు చేసేందుకు వీలుగా కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో కేంద్ర ఆర్థికశాఖ, పౌరసరఫరాలు, వ్యవసాయ, రోడ్డు రవాణశాఖల మంత్రులతో కలిసి ఓ కమిటీని కేంద్రం నియమించింది. దేశంలో ఉల్లి కొరత తీర్చడంతోపాటు ధరలను అదుపు చేసేందుకు కేంద్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి అవినాష్‌ కె శ్రీవాస్తవ చర్యలు తీసుకుంటున్నారు.