దేశం నుంచి తరిమికొట్టే ధైర్యం ఉందా?
యోగీ వ్యాఖ్యలపై మండిపడ్డ అసదుద్దీన్
హైదరాబాద్,డిసెంబర3(జనంసాక్షి ): తనను భారతదేశం నుంచి వెళ్లగొట్టే దమ్మూ, ధైర్యం ఎవరికి లేవని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అసదుద్దీన్ ఇక్కడి నుంచి పారిపోవాల్సి వస్తుందంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం నా తండ్రి దేశం. స్వర్గం నుంచి భూమి విూదకు వచ్చిన ప్రవక్త ఆదామ్ అని.. అది కూడా ఆయన మొదట వచ్చింది భారత్‌కేనని ఇస్లాం నమ్ముతుంది. కాబట్టి ఇది నా తండ్రి దేశం. అందుకే ఇక్కడి నుంచి నన్ను ఎవ్వరూ ఎక్కడికీ పంపలేరన్నారు. యూపీ సీఎం యోగి చరిత్ర తెలుసుకుని మాట్లాడాలన్నారు. విూర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్‌ను విడిచి పారిపోలేదన్న ఆయన దేశ తొలి ఉపప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్.. విూర్ ఉస్మాన్ అలీఖాన్‌ను రాజ్ ప్రముఖ్(గవర్నర్ 1948-56)గా నియమించి సత్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. చైనాతో యుద్ధం జరిగినప్పుడు తన బంగారమంతా దానం చేస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అయినా సొంత రాష్ట్రంలో సరైన సదుపాయాల లేక 150 మంది చిన్నారులు చనిపోతే ఏవిూ చేయలేని అసమర్ధ యూపీ సీఎం తన మాటలతో బెదిరించలేరని పేర్కొన్నారు.