దైవాంశ సంభూతుడు రాజకీయ అల్లర్లు సృష్టించరు
కావాలంటే మోడీకి ఓ గుడి కట్టాలి
కోల్‌కతా ర్యాలీలో దీదీ వ్యంగాస్త్రం
కోల్‌కతా,మే29 (జనంసాక్షి)
భారతదేశానికి నరేంద్ర మోదీ లాంటి ప్రధానమంత్రి అవసరం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. తాను ఎంతోమంతి ప్రధానమంత్రులతో కలిసి పని చేశానని, కానీ మోదీ లాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదని దుయ్యబట్టారు. దేవుళ్లు రాజకీయాలు చేయకూడదని, అల్లర్లను ప్రేరేపించకూడదని విమర్శించారు. తాను బయోలాజికల్‌గా జన్మించలేదని, ఒక లక్ష్యం కోసం ఆ దేవుడే తనని ఈ భూమి విూదకు పంపించాడని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఆమె ఈ విధంగా స్పందించారు. కోల్‌కతాలో నిర్వహించిన ఓ ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘ఒకరేమో ప్రధాని మోదీ దేవుళ్లకే దేవుడు అంటారు. ఒక నాయకుడేమో సాక్షాత్తు ఆ జగన్నాథుడే మోదీకి భక్తుడని చెప్తాడు. ఒకవేళ మోదీ దేవుడే అయితే, ఆయన రాజకీయాలు చేయకూడదు. దేవుడు అల్లర్లను ప్రేరేపించకూడదు. కావాలంటే ఆయన కోసం ఒక గుడి నిర్మించి, తరచూ పూజలు నిర్వహిద్దాం. పువ్వులు, ప్రసాదాలు సమర్పిద్దాం. ఒకవేళ ఆయన కోరుకుంటే ఢోక్లా కూడా అందజేద్దాం‘ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘నేను అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్, రాజీవ్ గాంధీ, నర్సింహారావు వంటి ప్రధానమంత్రులతో కలిసి పని చేశాను. కానీ.. మోదీ లాంటి వ్యక్తిని చూడలేదు. అలాంటి ప్రధాని దేశానికి అవసరం లేదు‘ అని తీవ్ర స్థాయిలో మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘నన్ను విమర్శించే వ్యక్తులున్నారు, నాపై అభిమానం కురిపించే వ్యక్తులూ ఉన్నారు. ఎవరేమనుకున్నా.. విశ్వాసం వ్యక్తం చేసే వారిని బాధపెట్టకుండా చూడటమే నా కర్తవ్యం. ఆ దేవుడు నన్ను ఓ లక్ష్యం కోసం ఎంపిక చేసుకున్నాడని నేను నమ్ముతాను. ఆ లక్ష్యం నెరవేరిన తర్వాత నా పని పూర్తవుతుంది. అందుకే నేను ఆ భగవంతునికి పూర్తిగా అంకితం చేసుకున్నాను‘ అని అన్నారు. ఆ దేవుడు తన వ్యూహాల్ని బహిర్గతం చేయడని, తనతో పనులు చేయిస్తున్నాడని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గానే.. మమతా బెనర్జీ పైవిధంగా సెటైర్లు వేశారు.